నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులను
సస్పెండ్ చేయాలి : డీజీపీ శివధర్ రెడ్డికి సీపీఐ(ఎం) వినతి
దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల పసిబిడ్డను హత్య చేసిన అగ్రకుల పెత్తందారులపై హత్యకేసు నమోదు చేయాలనీ, కేసును జాప్యం చేస్తున్న పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలని సీపీఐ(ఎం) కోరింది. దీంతోపాటు కోదాడలో దళిత యువకుడు మృతి చెందడం, కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లో డీజీపీ శివధర్‌రెడ్డికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, టి సాగర్, పార్టీ సీనియర్ నేత డిజి నరసింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పి ఆశయ్య, టి స్కైలాబ్‌బాబు, ఆర్ శ్రీరామ్ నాయక్‌ల బృందం వినతిపత్రం సమర్పించింది. వినతిపత్రంలోని ప్రధాన డిమాండ్లు..
‘నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో 2026 ఫిబ్రవరి 18న జరిగిన మల్లన్న జాతరలో సిలికేశ్వరం గణేష్, తల్లి చంద్రకళ, భార్య మౌనిక, అక్క కీర్తి దర్శనం కోసం వెళ్లారు. వీరిని కులం పేరుతో దూషించి, దౌర్జన్యంగా దాడి చేసి గణేష్ కూతురు రెండు నెలల పసి బిడ్డను ఆ గ్రామ అగ్రకుల పెత్తందారులైన ఉంద్యాల శ్రీనివాస్‌రెడ్డి (తండ్రి నారాయణరెడ్డి), సంగెం మధుసూదన్‌రెడ్డి (తండ్రి తిరుపతిరెడ్డి), గొంది శ్రీకాంత్‌రెడ్డి (తండ్రి జంగారెడ్డి), సంగెం విష్ణువర్ధన్‌రెడ్డి (తండ్రి రుక్మారెడ్డి), దేంది కన్నారెడ్డి (తండ్రి ఉపేందర్‌రెడ్డి), కటికే నరేష్ (తండ్రి జయజి), కంకణాల తుకారాంరెడ్డి (తండ్రి హనుమంత్ రెడ్డి), కంకణాల సతీష్‌రెడ్డి (తండ్రి తుకారాంరెడ్డి), కంకణాల మదన్‌రెడ్డి (తండ్రి గాలిరెడ్డి)లు కులం పేరుతో దూషించి, దౌర్జన్యంగా దాడి చేసి మానవమృగాల్లా ప్రవర్తించి, రెండు నెలల పసిబిడ్డను హత్య చేశారు.
మహిళలు అని చూడకుండా, నానా బూతులు తిట్టి అవమానించారు. ఇదేమిటని సోషల్ మీడియాలో ప్రశ్నించిన గణేష్‌ను మూడున్నర గంటల పాటు ఒక గదిలో నిర్భంధించి చితకబాదారు. తన భర్తను కొట్టొద్దంటూ కాళ్ళమీద పడి మౌనిక బతిమిలాడి వేడుకున్నా, కాళ్లతో తన్నారే కానీ, కనీసం కనికరించలేదు. ఘటన జరిగి ఏడు రోజులైనప్పటికీ ఎనిమిది మంది హంతకులకుగానూ, కేవలం నలుగురిని మాత్రమే అరెస్టు చేసారు. నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ గోవర్ధన్‌లు హంతకులకు రక్షణ కల్పిస్తూ, బాధితులపై అక్రమ కేసులు పెట్టారు. హత్య జరిగితే హత్యాయత్నం కేసు పెట్టడం అన్యాయం. తక్షణమే ఎనిమిది మంది హంతకును అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపి, కఠినంగా శిక్షించాలి.
హంతకులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలను సస్పెండ్ చేసి, బాధితులకు న్యాయం చేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. మరోకటి ‘కోదాడ గాంధీనగర్‌కు చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్‌ను పోలీసులు ఎఫ్‌ఐఆర్ లేకుండానే నాలుగు రోజులపాటు పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించి వేధించారు. అనారోగ్యంతో ఉన్నా పట్టించుకోకుండా, సరైన వైద్యం అందించకుండా రిమాండ్‌కు తరలించడంతో రాజేష్ మృతి చెందారు. ఇది స్పష్టంగా పోలీసుల నిర్లక్ష్యం వల్ల జరిగిన మరణం. ఈ కేసులో కోదాడ, చిలుకూరు పోలీసుల తీరుపై సమగ్ర విచారణ జరపాలి’ అని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై 142 హత్యలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటిపై విచారణ జరిపి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి నెలలో ఒకరోజు పౌర హక్కుల దినాన్ని అమలు చేసి, కుల వివక్ష దాడులు, హత్యలు, అత్యాచారాలను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు.
పసిబిడ్డ హంతకులపై కేసు నమోదు చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



