మౌనం వీడకుంటే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం : సీఎంకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హెచ్చరిక
హైదరాబాద్ ఆర్టీసీక్రాస్ రోడ్స్‌లో పార్టీ శ్రేణుల నిరసన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెరలో పసికందు మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. కుల దురహంకారులపై హత్యా కేసు నమోదు చేయాలనీ, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని ప్లకార్డులు, జెండాలు, బ్యానర్లు పట్టుకుని ఆందోళన చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ రజక సామాజిక వర్గానికి చెందిన మహిళ దేవాలయ ప్రవేశాన్ని అడ్డుకుని చిన్నారి హత్యకు కారకులైన గ్రామ సర్పంచ్ రామిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఎనిమిది మందిపై హత్యానేరం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసులు బాధితుల ఫిర్యాదు తీసుకోకుండా, దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశారని విమర్శించారు. బహిరంగంగా పోలీసులు హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే జిల్లా ఎస్పీ, డీఎస్పీ, కలెక్టర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీ, సీఐ, ఎస్ఐలను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో జరిగిన సంఘటనపై తక్షణమే స్పందించాలనీ, లేకుంటే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కోదాడలో దళిత యువకుడి లాకప్ డెత్‌కు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 142 కుల దురహంకార హత్యలు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. కుల దురహంకారం, అంటరాని తనంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులను రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కుమ్మెర ఘటన బాధిత కుటుంబానికి రూ. కోటి పరిహారంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 5 ఎకరాల భూమి, ఉద్యోగం ఇవ్వాలని జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో సీపీఐ(ఎం) నేత రామారావు హత్య కేసులోనూ పోలీసులు నిందితులను కాకుండా బాధితులనే వేధించారని గుర్తు చేశారు.
కుమ్మెర ఘటన నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి మాట్లాడుతూ చిన్న చిన్న ఘటనలకు స్పందించే రాష్ట్ర మహిళా కమిషన్ మహిళపై దాడి, పసిపాప హత్యపై ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు. కమిషన్ పరంగా వెంటనే తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి సాగర్, ఎండీ అబ్బాస్, బండారు రవికుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం వెంకటేశ్, జె బాబురావు, ఎంవీ.రమణ, ఆర్ శ్రీరాం నాయక్, పైళ్ల ఆశయ్య, టి స్కైలాబ్ బాబు, లెల్లల బాలకృష్ణ, ఉడుత రవిందర్‌తోపాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.



