నవతెలంగాణ – బోనకల్
తుఫాను ప్రభావంతో అకాల వర్షం వలన దెబ్బతిన్న మొక్కజొన్న పంటకు ఎకరానికి రూ. 25,000 పరిహారం చెల్లించాలని, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అధికార దర్పం మీద ఉన్న ప్రేమ రైతులపై లేదని సీపీఐ(ఎం) మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాల్ రావు ఘాటుగా విమర్శల వర్షం కురిపించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని బోనకల్ మండల పరిధిలోని రావినూతల, ఆళ్లపాడు, బోనకల్ తదితర గ్రామాలలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న మొక్కజొన్న, మిర్చి పంటలను సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం గురువారం పరిశీలించింది. పంట నష్టపోయిన రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పంట పొలాలలోనే జరిగిన విలేకరుల సమావేశంలో మడిపల్లి గోపాలరావు, సీపీఐ(ఎం) జిల్లా సీనియర్ నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు, తెలంగాణ రైతు సంఘం మధిర డివిజన్ కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు సిపిఎం మండల కార్యదర్శి కిలారు సురేష్ మాట్లాడుతూ బోనకల్ మండల వ్యాప్తంగా సుమారు ఇటీవల కురిసిన అకాల వర్షాల వలన 1000 నుంచి 1500 ఎకరాలలో మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టం అయింది అన్నారు.
దీనివలన రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. అకాల వర్షాలు కురిసి రెండు రోజులు అవుతున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టే విక్రమార్క గాని మండల వ్యవసాయ శాఖ అధికారులు కానీ కనీసం పరిశీలించలేదని ఆయన విమర్శించారు. డిప్యూటీ సీఎం నుంచి కనీసం ఒక ప్రకటన కూడా రైతుల కోసం విడుదల చేయలేదన్నారు. మల్లు భట్టి విక్రమార్క కు అధికార దర్పం మీద ఉన్న ప్రేమ రైతులపై లేదని ఘాటుగా విమర్శించారు. పదేపదే రైతుల సంక్షేమం గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం రైతుల దారుణంగా దెబ్బతింటే ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. మరో కొద్ది రోజులలో మొక్కజొన్న పంట చేతికి వచ్చేదని, కానీ అకాల వర్షాల వలన నేలమట్టం అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రావినూతల గ్రామానికి చెందిన రైతు ఎర్రగాని నాగరాజు కు చెందిన ఐదు ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టం అయిందన్నారు. ఒక్కొక్క ఎకరానికి సుమారు 50 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్టు నాగరాజు తెలిపారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం పసల బీమా పథకం కింద పంటల భీమా సౌకర్యాన్ని కల్పిస్తే దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం వలన పంటలకు బీమా సౌకర్యం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిందని విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాల వలన రైతుల నష్టపోతే కనీసం పంటల భీమా కింద ఎంతో కొంత పరిహారం వచ్చేది అన్నారు.
అది కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్నారు. కేవలం రావినూతలలోనే సుమారు 200 ఎకరాల వరకు మొక్కజొన్న పంటకు నష్టం జరిగినట్లు రైతులు తెలుపుతున్నారని తెలిపారు. మల్లు భట్టి విక్రమార్క కు రైతులపై ఎంత ప్రేమ ఉందో దీనిని బట్టి అర్థమవుతుందన్నారు. పంటలను పరిశీలించిన వారిలో తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షుడు కొమ్మినేని నాగేశ్వరరావు రైతు సంఘం నాయకులు దొండపాటి సత్యనారాయణ సీపీఐ(ఎం) నాయకులు బంధం శ్రీనివాసరావు, గుగులోత్ పంతు, పఠాన్ అఫ్జల్ ఖాన్, బుక్య కృష్ణ, కొంగర గోపి, షేక్ నన్నే సహెబ్, గార్లపాటి కిషోర్, బుక్యా సైదా, భూక్యా రమేష్, లావూరి వెంకటేశ్వర్లు, బాధిత రైతు ఎర్రగాని నాగరాజు, ఆళ్లపాడు సర్పంచ్ తెల్లబోయిన నాగేశ్వరరావు, సిపిఎం నాయకులు బండి నాగేశ్వరరావు, బండి పుల్లయ్య, గద్దల వెంకటేశ్వర్లు, అల్లికబ్బయ్య, మొండితోక లక్ష్మణ్, షేక్ దాదే సాహెబ్, తదితరులు పాల్గొన్నారు.
12 ఎకరాలలో 5 ఎకరాలు పూర్తిగా నేలమట్టం: రైతు, ఎర్రగాని నాగరాజు, రావినూతల.
12 ఎకరాలను కౌలుకి తీసుకొని మొక్కజొన్న పంట సాగు చేశాను. ఒక్కొక్క ఎకరానికి కౌలు రూ. 25 వేల రూపాయలు. ఎకరానికి పెట్టుబడి మరో రూ. 25 వేలు పెట్టాను. మొత్తం 12 ఎకరాలకు గాను కౌలు, పెట్టుబడి కలిపి మొత్తం రూ.6 లక్షల వరకు ఖర్చు వచ్చింది. అకాల వర్షం దెబ్బకు పూర్తిగా ఐదు ఎకరాలు నేలమట్టమయింది. దీంతో సుమారు కౌలు, పెట్టుబడి కలిపి సుమారు రూ.3 లక్షలు నష్టపోయాను. నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు.



