నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలంలోని సాయి గూడెం గ్రామంలో బేతి అంజిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో గురువారం రోజున మామిడి తోటల యాజమాన్యం, ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులు పాల్గొని రైతులకు పలు కీలక సూచనలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి మాధవి, డీఏఓ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు విధానాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అందుబాటులో ఉన్న రాయితీలు,సబ్సిడీల వివరాలను రైతులకు తెలియజేశారు.ఉద్యాన శాఖ తరఫున రైతులు పొందగల ప్రయోజనాలపై సమగ్ర అవగాహన కల్పించారు.
అనంతరం జనగాం జిల్లా ఆయిల్‌ఫెడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శంకర్ ఆయిల్ ఫామ్ సాగులో పాటించాల్సిన మెలకువలు,సరైన నీటి పారుదల (ఇరిగేషన్) పద్ధతులు, అధిక దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆ తర్వాత ఫల పరిశోధన స్థానం సంగారెడ్డి నుండి వచ్చిన శాస్త్రవేత్త హరికాంత్ మామిడి పంటలో పూత–పిందె దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,చీడపీడల యాజమాన్య పద్ధతులు,ఫ్రూట్ కవర్ల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.సమయానికి నిర్వహణ చర్యలు చేపడితే నాణ్యమైన దిగుబడి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారులైన స్రవంతి (హెచ్ఓ ఆత్మకూర్), స్నేహిత (హెచ్ఓ టెక్నికల్), కవిత (హెచ్ఓ చౌటుప్పల్), ఏఓ శ్రీనివాస్, టీజీ, ఆయిల్ ఫెడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ స్వర్ణలత,ఏఈవోలు, నేతఫిమ్ డీసీఓ పాషా మరియు సిబ్బంది పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో రైతులు హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.



