– అశ్వారావుపేట లో “ ఎరైవ్ ఎలైవ్ – సజీవంగా చేరుకోండి” పై అవగాహన
– ప్రమాదంలో శిరస్త్రాణం (హెల్మెట్ ) ప్రాణాధారం
– రోడ్డు భద్రతపై పోలీసుల ప్రత్యేక దృష్టి
నవతెలంగాణ – అశ్వారావుపేట
చెప్పి రాని ప్రమాదం లో శిరస్త్రాణం (హెల్మెట్) ప్రాణాధారం అవుతుంది అని సీఐ నాగరాజు రెడ్డి అన్నారు. సక్రమంగా ప్రయాణించి,సజీవంగా చేరుకోండి అనే థీం తో పోలీస్ శాఖ చేపట్టిన రోడ్డు భద్రత పై ఎర్రైవ్ ఎలైవ్ రెండో దఫా అవగాహన లో భాగంగా నియోజకవర్గం కేంద్రం,అశ్వారావుపేట పట్టణంలో రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు స్థానిక పోలీసులు ఆధ్వర్యంలో గురువారం బస్ స్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికులు కు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాలు, శిరస్త్రాణం (హెల్మెట్ )వినియోగం, వేగ నియంత్రణ వంటి అంశాలపై ప్రజలకు వివరణాత్మకంగా తెలియజేశారు.
ఎస్ హెచ్ ఓ, ఎస్సై టి.యయాతి రాజు మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు మాత్రమే కాకుండా పిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.ముఖ్యంగా 4 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం చట్టబద్ధమైన బాధ్యత అని పేర్కొన్నారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం తగ్గుతుందని వివరించారు. అలాగే, మద్యం సేవించి వాహనం నడపడం, అధిక వేగంతో ప్రయాణించడం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను లెక్కచేయకపోవడం వంటి చర్యలు తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ నియమాలను పాటించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. స్థానికులు కూడా కార్యక్రమానికి స్పందించి రోడ్డు భద్రతపై తమ మద్దతు తెలిపారు.



