మయాంక్ అజేయ సెంచరీ
హుబ్లీ : ఎనిమిది సార్లు రంజీ ట్రోఫీ చాంపియన్ కర్నాటక సొంతగడ్డపై అనూహ్య తడబాటుకు గురవుతోంది. జమ్మూ కశ్మీర్ పేసర్ అకిబ్ నబి (3/32) వరుస బంతుల్లో కరుణ్ నాయర్ (0), రవిచంద్రన్ స్మరణ్ (0)లను సాగనంపటంతో పాటు కెఎల్ రాహుల్ (13)ను సైతం అవుట్ చేయటంతో కర్నాటక కష్టాల్లో కూరుకుంది. దేవదత్ పడిక్కల్ (11), శ్రేయాస్ గోపాల్ (27) నిరాశపరిచారు. 57/4తో కర్నాటక పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న వేళ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (123 నాటౌట్, 189 బంతుల్లో 17 ఫోర్లు) అజేయ సెంచరీతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు.
మూడో రోజు ఆట ముగిసేసరికి కృతుక్ కృష్ణ (18 నాటౌట్) తోడుగా మయాంక్ అగర్వాల్ క్రీజులో కొనసాగుతున్నాడు. కర్నాటక తొలి ఇన్నింగ్స్‌లో 62 ఓవర్లలో 204/5తో నిలువగా.. తొలి ఇన్నింగ్స్‌లో మరో 380 పరుగుల వెనుకంజలో కొనసాగుతుంది. జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 173.1 ఓవర్లలో 584/10 పరుగుల భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్ బ్యాటర్లలో శుభమ్ (121), యావర్ హసన్ (88), పరాస్ (70), అబ్దుల్ సమద్ (61), కన్హయ్య (70), సాహిల్ (72) సమిష్టిగా రాణించారు.



