Friday, February 27, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబీఆర్‌ఎస్‌ అవినీతికి బీజేపీ సహకారం

బీఆర్‌ఎస్‌ అవినీతికి బీజేపీ సహకారం

- Advertisement -

కాళేశ్వరంపై సీబీఐ విచారణలో కేంద్రం నిర్లక్ష్యం
కడుపులో విషం నింపుకుని కాంగ్రెస్‌ పాలనపై విషం చిమ్ముతున్నారు
పేదలే ఇందిరమ్మ ప్రభుత్వ పేటెంట్‌
వెలుగుమెట్లలో 2023లో ఇండ్లు కూలగొట్టింది గత ప్రభుత్వమే
బాధితులకు ఇంటిస్థలం, ఇండ్లు ఇచ్చే బాధ్యత మాదే
మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్‌, వివేక్‌

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ సర్కారుకు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందంటూ విమర్శలు గుప్పించిన బీజేపీ నాయకులే ఇప్పుడు అదే పార్టీకి సహకరిస్తున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కాళేశ్వరం అక్రమాలపై సీఐబీ విచారణకు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దానిపై విచారణ కమిటీని నియమించామనీ, ఆ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఫెవికాల్‌ బంధం వల్లే సీబీఐ విచారణ ముందుకు సాగడం లేదని విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, జి వివేక్‌ వెంకటస్వామి, ఎంపీలు బలరాంనాయక్‌, రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కలిసి విలేకర్లతో మాట్లాడారు.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటివరకు జరిగిన పార్లమెంటు, ఉప ఎన్నికలు, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పట్టం కట్టడాన్ని బీఆర్‌ఎస్‌ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. కడుపులో విషం పెట్టుకుని ప్రజా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి బీజేపీ నేతలు వంతపాడుతున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌ను కాదని కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిందని అన్నారు. ఆ ప్రాజెక్టును ఎనిమిదో వింతగా ప్రచారం చేసిందని గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టును టూరిస్టు కేంద్రంగా మార్చేందుకు బస్సులు పెట్టి తీసుకెళ్లారని, చివరికి అది పేకమేడల్లా కూలిందని ఎద్దేవా చేశారు. మార్చి16 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌, బావ బావమరుదులు వచ్చి మాట్లాడాలని సూచించారు. దానిపై రాష్ట్ర ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందన్నారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్రంగా చర్చించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పారు. రూ.1.40 లక్షల కోట్లతో డీపీఆర్‌ సిద్ధం చేసిన బీఆర్‌ఎస్‌…దాన్ని రూ.1.80 లక్షల కోట్లకు బడ్జెట్‌ పెంచిందని తెలిపారు. నాలుగేండ్లలో 168 టీఎంసీల నీరు ఇస్తామని చెప్పి వంద టీఎంసీలను మాత్రమే ఇచ్చిందన్నారు. మిగతా నీటిని సముద్రం పాలుజేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి వర ప్రదాయినిగా పేరొందిన ప్రాణహిత చేవెళ్ల పెండింగ్‌ పనులను కొనసాగించలేదని చెప్పారు. చాలా చోట్ల పిల్ల కాల్వలను కూడా తవ్వలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి చేసిన అప్పుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 48వేల కోట్లు రీపేమెంట్‌ చేసిందన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఆర్థికభారం పడుతోందని తెలిపారు. అయినప్పటికీ ప్రజాసంక్షేమాన్ని కొనసాగిస్తూ… ముందుకు పోతున్నామని చెప్పారు.

ఉత్తర తెలంగాణకు అన్యాయం : మంత్రి పొన్నం
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల విషయంలో ఉత్తర తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. 196 టీఎంసీల నీరు ఇస్తామని చెప్పి 168 టీఎంసీలకు పరిమితం చేసిందని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక బీఆర్‌ఎస్‌ సర్కారు చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసిందని తెలిపారు. మంత్రి వివేక్‌ వెంకటస్వామి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ అవినీతికి పాల్పడిందన్నారు. దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో బీఆర్‌ఎస్‌ ధనిక పార్టీగా మారిందని చెప్పారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఎలక్ట్రోరల్‌ బాండ్లు దీనికి నిదర్శనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా ఏర్పడిన నష్టాన్ని కేసీఆర్‌ నుంచి వసూలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

నాడు పేదల ఇండ్లను బీఆర్‌ఎస్సే కూల్చింది : పొంగులేటి
2023 జులై15న వెలుగుమట్లలో నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే పేదల ఇండ్లను కూలగొట్టించిందని చెబుతూ నాడు కూల్చివేత ఘటనల ఫొటోలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు ప్రదర్శించారు. వెలుగుమెట్లలో పేదలకు తిరిగి ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి గాలికి వదిలేసిందన్నారు. కానీ ఇందిరమ్మ ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులకనుగుణంగా అక్కడ అక్రమంగా ఉన్న ఇండ్లను తొలగించిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి సూచనల మేరకు అక్కడ అర్హులైన పేదలకు ఇంటి స్ధలం, ఇండ్లు ఇస్తామన్నారు. పేదలే ఇందిరమ్మ ప్రభుత్వ పెటెంట్‌ అని అన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఫామ్‌హౌస్‌లో ఉండి కుట్రలు చేస్తున్న కేసీఆర్‌ ఇప్పటికైనా కాళేశ్వరంలో దోచుకున్న, దాచుకున్న సొమ్ములో కొంత భాగాన్ని బయటకు తీసి పేదలకు ఇండ్లు కట్టించి పాప పరిహారం చేసుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -