Friday, February 27, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువంద తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు

వంద తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు

- Advertisement -

రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున పైలెట్‌ ప్రాజెక్టు
ఆరుట్ల పాఠశాల తరహాలో సకల వసతులు, రవాణా సౌకర్యాలు
క్యూర్‌ పరిధిలో అన్ని హంగులతో ఏర్పాటు
ఏఐ సాంకేతికతపై ఉపాధ్యాయులు, అధ్యాపకులకు శిక్షణ
ప్రాథమికస్థాయి నుంచి 12వ తరగతి వరకు బ్రేక్‌ఫాస్ట్‌ : విద్యాశాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
వర్సిటీలకు నిధుల అందజేతపై నివేదిక ఇవ్వండి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో (హైదరాబాద్‌ నగరం వెలుపల) తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లను ఈ ఏడాది నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. తరగతి గదులు, క్రీడా మైదానం, ఇతర అన్ని రకాల వసతులు, బోధనా సిబ్బంది, రవాణా సౌకర్యం కలిగి ఉన్న రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ తరహాలోనే ఈ వంద స్కూళ్లు ఉండాలని నిర్దేశించారు. గురువారం హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విద్యాశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన విద్యకు చిరునామాగా తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని ఆయన తెలిపారు. ఇందుకు ఎంత వ్యయమైనా వెనుకాడేది లేదని సీఎం స్పష్టం చేశారు. కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) పరిధిలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలల తరహాలో నిర్మించాలని ఇంజినీర్లను ఆదేశించారు.

వీటి నిర్మాణంలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలనీ, ఏడాదిలో క్యూర్‌ పరిధిలో నిర్దేశించుకున్న 12ఇంటిగ్రేటెడ్‌ నూతన పాఠశాలల నిర్మాణం పూర్తి కావాలని సీఎం సూచించారు. నగరంలోని భారతీయ విద్యా భవన్‌, జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూళ్లలో ఉండే అన్ని వసతులు ఈ ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలల్లో ఉండాలని ముఖ్యమంత్రి తెలిపారు. క్యూర్‌లో అప్‌గ్రేడ్‌ చేయనున్న 17 పాఠశాలలు, అదనపు గదులు, ఇతర వసతులు కల్పించనున్న 164 పాఠశాలల పనుల్లో ఎటువంటి రాజీ పడకూడదని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో 99 రోజుల పాటు చేపట్టనున్న కార్యక్రమాల్లో వారం రోజులు విద్యా సంబంధిత అంశాలకు కేటాయించాలని సీఎం సూచించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు.. పాఠశాలలు, కళాశాలలను సందర్శించి అవసరమైన వసతుల కల్పన, ఇతర అంశాలను తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.

సాంకేతికతకు అనుగుణంగా మార్పులు తేవాలి
కృత్రిమ మేథ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తున్న నేపథ్యంలో పాఠశాల స్థాయి నుంచి దాని బోధనకు అవసరమైన చర్యలను తక్షణమే చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేలా ఏఐపై ఉపాధ్యాయులు, లెక్చరర్లకు స్వల్పకాలిక శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏఐతో ప్రపంచ వ్యాప్తంగా వచ్చే మార్పులను తెలుసుకొని దాని ద్వారా వచ్చే అవకాశాలు మన విద్యార్థులే అందిపుచ్చుకునేలా మన సన్నద్ధత ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. సాంకేతిక విద్యా విధానంలో అందుకు అనుగుణమైన మార్పులను తీసుకురావాలని కోరారు.

2026-2027 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ ఫాస్ట్‌ అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. బ్రేక్‌ ఫాస్ట్‌ అందజేతకు సంబంధించి అధికారులు, హరేకృష్ణ మిషన్‌ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ప్రతి విద్యార్థికి పాలు అందజేయాలనీ, ఇందుకు విజయా డెయిరీ నుంచి పాలను సేకరించాలని సీఎం ఆదేశించారు. అదే విధంగా విద్యార్థులకు ఎన్ని క్యాలరీలు అందజేస్తున్నామనేది తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. పాఠశాల విద్యార్థులకు స్కూల్‌ యూనిఫాం, పుస్తకాలతో పాటు ఈ ఏడాది నుంచి స్కూల్‌ బ్యాగ్‌, పెన్నులు, పెన్సిళ్లు, షార్పనర్లు, రంగుల పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు, డిక్షనరీ, బూట్లు, సాక్సులు ఉండే కిట్‌ ఇవ్వాలని తెలిపారు. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని బడ్జెట్‌లో పొందుపర్చేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఏఐ ఆధారిత కోర్సులు వెంటనే ప్రారంభించాలి
పాలిటెక్నిక్‌ కళాశాలలు, ఏటీసీల్లో ఏఐ ఆధారిత కోర్సులు వెంటనే ప్రారంభించాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. కాలం చెల్లిన కోర్సులను తొలగించాలన్నారు. పాలిటెక్నిక్‌, ఏటీసీల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి వెంటనే వివిధ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభించేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయాలకు నిధులు కేటాయిస్తామని సీఎం తెలిపారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు కేటాయించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. మిగతా యూనివర్సిటీలకు ఎంత నిధులు అవసరమనే దానిపై నివేదిక సమర్పించాలని ఉన్నత విద్యా మండలి చైర్మెన్‌ బాలకిష్టారెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి తెలంగాణ ప్రయివేటు పాఠశాలల ఫీజు రెగ్యులటరీ మానిటరింగ్‌ కమిషన్‌ తమ నివేదికలోని అంశాలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఎదుట ఉంచింది. వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలు, తెలంగాణలో తీసుకోవాల్సిన అంశాలను వివరించింది. దీనిపై సావధానంగా విన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి జిల్లా స్థాయిలో కలెక్టర్‌, డీఈవోల నేతత్వంలో పాఠశాలలను పరిశీలించి ఫీజుల నిర్ణయంపై నివేదిక సమర్పించాలన్నారు.. రాష్ట్ర స్థాయిలో రిటైర్డ్‌ జడ్జి లేదా రిటైర్డ్‌ చీఫ్‌ సెక్రెటరీ స్థాయిలోని కమిటీ తుది కమిటీగా ఉండి నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. అలాగే ఫీజుల నియంత్రణకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు, సామాజికవేత్తల అభిప్రాయ సేకరణకు ముసాయిదాను పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచాలని సీఎం సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -