నెతన్యాహూ దంపతుల అతిథిగానే మోడీ ఇజ్రాయిల్ పర్యటన
ఆ దేశ పార్లమెంటులో ప్రతిపక్షాలు లేకుండానే ప్రసంగం
ట్రంప్‌తో సత్సంబంధాలకు సహకారం పొందడానికే?
తనతో సంబంధాలను కోరుకునే దేశాలకు ఇజ్రాయిల్ రెండు ‘ప్యాకేజీల’ను అందించడం దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. మొదటిది…ఆయుధాలను సమకూర్చడం, అంతర్గత భద్రతలో సాయపడడం. రెండోది…అమెరికా అధ్యక్ష భవనంతోనూ, ప్రతినిధి సభతోనూ సంబంధాలను మెరుగుపరచడంలో సాయపడడం. ఇందులో రెండో ప్యాకేజీకే మోడీ పర్యటన ఉద్దేశించబడిందన్న వాదన వినిపిస్తోంది. రక్షణ ఒప్పందాలను ఖరారు చేసుకోవడానికే మోడీ ఇజ్రాయిల్‌లో పర్యటిస్తున్నారని చెబుతున్నప్పటికీ భారత్ అనేక సంవత్సరాలుగా ఇజ్రాయిల్ నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తూనే ఉంది.
అందువల్ల తమకు మరిన్ని ఆయుధాలను అమ్మాల్సిందిగా కోరడానికి మోడీ ఆ దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు. కాబట్టి రెండో ప్యాకేజీ పొందడమే మోడీ పర్యటన ఉద్దేశమని చెప్పవచ్చు. కొంతకాలంగా ట్రంప్‌తో మోడీ సంబంధాలు సజావుగా సాగడం లేదన్న విషయం తెలిసిందే. ఈ సమస్యను పరిష్కరించుకోవడంలో నెతన్యాహూ సాయం కోరేందుకు మోడీ ఇజ్రాయిల్ వెళ్లారని చెప్పడం సముచితంగా ఉంటుంది.
న్యూఢిల్లీ : ” ఇజ్రాయిల్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశానికి తలవంపులు తెచ్చారు. మోడీ పర్యటనకు కారణం ఏదైనప్పటికీ ఆయన దేశాన్నే కాకుండా తనను తాను అవమానించుకున్నారు. ప్రపంచంలోని ఓ శక్తివంతమైన దేశంలో పర్యటిస్తున్న ఒక చిన్న దేశపు నాయకుడిగా మోడీ వ్యవహరించారు. ఆయన ప్రసంగం కూడా అలాగే సాగింది. ఇజ్రాయిల్ మెప్పు పొందేందుకు మోడీ చేయాల్సిందంతా చేశారు”. ఈ మాటలన్నది మన దేశంలోని ప్రతిపక్ష నేతలు కాదు… ఇజ్రాయిల్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త, న్యాయవాది ఇటే మాక్. ప్రారంభం నుంచే మోడీ ఇజ్రాయిల్ పర్యటన అనేక ప్రశ్నలు లేవనెత్తింది.
ఇజ్రాయిల్‌లో పర్యటించేందుకు, ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో భేటీ అయ్యేందుకు చాలా మంది ప్రపంచ నేతలు విముఖత ప్రదర్శిస్తున్నారు. ఇజ్రాయిల్ వెళితే తమ ఇమేజ్ దెబ్బతింటుందని వారు భయపడుతున్నారు. గాజాలో ఇజ్రాయిల్ సాగించిన మారణహోమాన్ని, వెస్ట్‌బ్యాంక్‌లో అది సాగించిన అరాచకాలనూ ఖండించిన పలువురు ప్రపంచ నేతలు ఆ దేశంతో వ్యాపారాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఇజ్రాయిల్ పర్యటనలో మొదటి రోజు ఎవరూ ఊహించని విధంగా మోడీ వ్యవహరించారు. ఇటీవలి కాలంలో ఇజ్రాయిల్‌లో పర్యటించిన విదేశీ నేతలెవ్వరూ ఇంత ఇబ్బందికరంగా, అవమానకరంగా వ్యవహరించలేదు.
ప్రయివేటు అతిథిగానే…
ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ, ఆయన భార్య సారా కేవలం దంపతులు మాత్రమే కారు. వారు రాజకీయ భాగస్వాములు కూడా. ఇజ్రాయిల్ చట్టసభకు ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరగబోతు న్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరూ ప్రచార కార్యక్రమాలలో తలమునకలై ఉన్నారు. మోడీ ఇజ్రాయిల్‌లో కాలు మోపగానే నెతన్యాహూ దంపతులు ఆయనకు స్వాగతం పలికారు. ఇరువురు నేతలు పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. పర్యటనలో మొదటి రోజైన బుధవారం నెతన్యాహూ కార్యాలయం ఓ ప్రకటన చేసింది.
మోడీని ప్రభుత్వ అతిథిగా కాకుండా నెతన్యాహూ కుటుంబానికి చెందిన ప్రయివేటు అతిథిగా అందులో ప్రస్తావించింది. నెతన్యాహూ ఆహ్వానం మేరకు మోడీ ఇజ్రాయిల్ వచ్చారని, వారి మధ్య వ్యక్తిగతంగా సన్నిహిత, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని తెలిపింది. ఇరువురు నేతల మధ్య ‘వ్యక్తిగత సమావేశం’ జరుగుతుందని, ఆ తర్వాత మోడీ గౌరవార్థం నెతన్యాహూ దంపతులు విందు ఇస్తారని చెప్పింది. ప్రకటనలో ఉపయోగించిన భాష నెతన్యాహూ నిరంకుశ వైఖరికి అద్దం పడుతోంది. ఇజ్రాయిల్ అంటే తానేనని, తానంటే ఇజ్రాయిలేనని ఆయన భావిస్తారు. తాను లేకుండా ఇజ్రాయిల్‌లో ఏమీ జరగదని నెతన్యాహూ నమ్మకం.
ఆ పతకానికి అంత సీన్ లేదు
సమావేశానికి ప్రతిపక్షాలు హాజరు కాకపోయినప్పటికీ ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. గాజా స్ట్రిప్‌లో ఉంటున్న వారందరినీ తగల బెట్టాలని, చంపేయాలని, ఆకలితో అలమటించేలా చేయాలని, బహిష్కరించాలని పిలుపు ఇచ్చిన మంత్రులు, శాసనకర్తలతో కూడిన సభను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. హమాస్ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు మోడీ సంతాపం తెలియ జేయడం హాస్యాస్పదంగా ఉంది. ఇదిలావుండగా మోడీకి ఇబ్బందికరమైన క్షణం ఒకటి పార్లమెంటులో ఎదురైంది.
స్పీకర్ ఆయనకు నెస్సెట్ పతకాన్ని బహుకరించారు. ఇదే ‘నెస్సెట్ ఇవ్వగల అత్యున్నత గౌరవం’ అని చెబుతుంటారు. కానీ నిజానికి ఇది ఓ కట్టుకథ. పార్లమెంట్ నిబంధనలలో కానీ, ఇజ్రాయిల్ చట్టంలో కానీ ఆ పతకానికి అంతటి ప్రాధాన్యత ఏమీ ఇవ్వలేదు. మోడీ మాత్రం దానిని అత్యంత గౌరవంగా స్వీకరిస్తున్నానని చెప్పుకొచ్చారు. నెతన్యాహూ దంపతులు ఇచ్చిన విందుతో మోడీ తొలి రోజు పర్యటన ముగిసింది. ఇది ‘మా విందు’ అని నెతన్యాహూ తెలిపారు. వాస్తవానికి ఇజ్రాయిల్‌లోని పన్ను చెల్లింపుదారులు జమ చేసిన సొమ్ము నుంచి ఈ కార్యక్రమానికి డబ్బు ఖర్చు చేశారు. అయినప్పటికీ దీనిని ఓ ప్రైవేటు వ్యవహారంగా చూపారు.
కుర్చీలు నింపేందుకు మాజీ సభ్యులకూ ఆహ్వానం
ఇజ్రాయిల్ పార్లమెంట్ నెస్సెట్ ఇంకెంత మాత్రం ప్రజాస్వామిక సంస్థ కాదని, అది నెతన్యాహూకు రబ్బర్ స్టాంపు అని తెలిసినప్పటికీ మోడీ దానిని ఉద్దేశించి ప్రసంగించాలని భావించారు. నెతన్యాహూకు నెస్సెట్ స్పీకర్ అమిర్ ఒహానా కీలుబొమ్మ. పార్లమెంట్ సమావేశానికి సుప్రీంకోర్టు అధ్యక్షుడిని ఆహ్వానించేందుకు నిరాకరించడం ద్వారా ఆయన ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారు. దీంతో మోడీ ప్రసంగాన్ని బహిష్కరిస్తామని ప్రతిపక్షాలు ముందుగానే ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో కుర్చీలు ఎక్కడ ఖాళీగా కన్పిస్తాయేమోనన్న అనుమానంతో నెస్సెట్ మాజీ సభ్యులను కూడా స్పీకర్ ఆహ్వానించారు. ఆహ్వానితులలో ఓరెన్ హజాన్ కూడా ఉన్నారు. ఆయనపై అనేక ఆరోపణలు, కేసులు ఉన్నాయి. ఆయనతో పాటు కాస్మొటిక్స్ వ్యాపారి ప్నినా రోసెన్‌బ్లమ్ కూడా వచ్చారు. ఆమె తరచూ యుద్ధ నేపథ్య పాటలను రికార్డు చేసి పాడుతుంటారు. అయితే ఆమె మోడీతో ఫొటో మాత్రమే దిగారు. పాట పాడలేదు.



