Friday, February 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యారంగానికి 18 శాతం నిధులు కేటాయించాలి

విద్యారంగానికి 18 శాతం నిధులు కేటాయించాలి

- Advertisement -

ప్రయివేటు ఫీజుల నియంత్రణకు స్వతంత్ర కమిటీ
ఎన్‌ఈపీని పూర్తిగా ఆమోదించొద్దు… అలాగని పూర్తిగా వ్యతిరేకించొద్దు
ఇంటర్‌ బోర్డును ఎస్సెస్సీ బోర్డులో విలీనం చేయాలి
ఎప్‌సెట్‌ను పూర్తిగా ఎత్తేయాలి
నర్సరీ నుంచే ఇంగ్లీష్‌ మీడియం
ప్రభుత్వానికి విద్యా కమిషన్‌ సిఫారసులు
434 ప్రతిపాదనలతో సీఎంకు నివేదిక సమర్పణ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 18శాతం నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్‌ సిఫారసు చేసింది. గురువారం హైదరాబాద్‌లో కమిషన్‌ చైర్మెన్‌ ఆకునూరి మురళీ… సభ్యులు ప్రొఫెసర్‌ పీ.ఎల్‌.విశ్వేశ్వరరావు, డాక్టర్‌ చారకొండ వెంకటేష్‌, జ్యోత్స్న శివారెడ్డితో కలిసి సీఎం రేవంత్‌ రెడ్డికి కీలకమైన 434 ప్రతిపాదనలతో కూడిన సమగ్ర నివేదికను సమర్పించారు. అనంతరం విద్యా కమిషన్‌ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిఫారసుల్లోని ముఖ్యాంశాలను మురళీ వెల్లడించారు. పదేండ్లపాటు రాష్ట్రంలో ధ్వంసమైన ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిన పెట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ప్రయివేటు పాఠశాలలను ఆరు క్యాటగిరీలుగా పరిగణనలోకి తీసుకుని ఫీజులు నియంత్రించేలా స్వతంత్ర కమిటీ ఒకటి ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ విద్యా విధానాన్ని(ఎన్‌ఈపీ) పూర్తిగా వ్యతిరేకించడం లేదా ఆమోదించడం సరికాదనీ, అందులోని మంచి సూచనలను స్వీకరించాలని సిఫారసు చేశారు.

ఇంటర్‌ బోర్డును ప్రత్యేకంగా నిర్వహించడం ద్వారా ప్రయోజనం లేదనీ, ఎస్సెస్సీ బోర్డులో విలీనం చేసి 12వ తరగతి వరకు పాఠశాల విద్యలో భాగం చేయాలని కోరారు. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో బోర్డు పరీక్షను ఎత్తివేయాలనీ, ఎప్‌ సెట్‌ను కూడా ఎత్తేసి ఇంటర్‌ మార్కులతో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీల్లో ప్రవేశాలు కల్పించాలని కోరినట్టు తెలిపారు. నర్సరీ నుంచే ఇంగ్లీష్‌ మీడియంలో బోధన కొనసాగాలని సూచించారు. వీటితో పాటు కమిషన్‌ ప్రభుత్వ విద్యావ్యవస్థ సమూల మార్పు కోసం లోతైన విశ్లేషణతో పలు సిఫారసులను చేసింది. ఒక సంవత్సరం నాలుగు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో కమిషన్‌ పర్యటించింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించింది.

46 సమావేశాలు, 10 సెమినార్లు, 7 యూనివర్సిటీల్లో పబ్లిక్‌ హియరింగ్‌ తర్వాత మేధోమదనం నిర్వహించి సిఫారసులను రూపొందించింది. ఒక్కో మండలంలో కనీసం మూడు తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లను ఏర్పాటు చేయాలి. ఆ స్కూళ్లు గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో అన్ని సౌకర్యాలతో ఉండాలి. ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ ఉండాలి. స్కూల్‌ డిస్ట్రిక్ట్స్‌ను ఏర్పాటు చేయాలి. దాని ఆధ్వర్యంలో స్కూళ్ల నిర్వహణ జరగాలి. నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు ఇంగ్లీషులోనే బోధన జరగాలి. మిడ్డే మీల్స్‌ వర్కర్లకు వారంతంలో చెల్లింపులు జరగాలి. 11, 12 తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలి. టీచర్‌ అర్హతలుగా ప్రీ ప్రైమరీకి డిగ్రీ ఉండాలి. ఆ పైన రెండు రకాల బీ.ఈడీలు అంటే బీ.ఈడీ (ప్రైమరీ), బీ.ఈడీ (సెకెండరీ)తో పాటు పీజీ ఉండాలని తెలిపింది. ప్రయోగాత్మకంగా ఆరుట్లలో ప్రారంభించిన తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ (టీపీఎస్‌)తో 36 రకాల ప్రయోజనాలు కలిగాయి.

ఒక్కో విద్యార్థిపై ప్రస్తుతం రూ.లక్ష (ఏడాదికి) ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా, టీపీఎస్‌ల ఏర్పాటుతో ఆ ఖర్చు దాదాపు రూ.50 వేలకు తగ్గడంతో పాటు తల్లిదండ్రులు, విద్యార్థులకు మేలు కలుగుతుంది. కోచింగ్‌ సెంటర్లు, జూనియర్‌ కాలేజీలు, హాస్టల్స్‌కు వేర్వేరుగా అనుమతి తీసుకునేలా నియంత్రించాలి. ఇంటర్‌ బోర్డును స్కూల్‌ బోర్డులో విలీనం చేయాలి. పాస్‌ మార్కులను దశల వారీగా పెంచాలి. యూనివర్సిటీల్లో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ తరహాలో కంట్రోలర్‌ ఆఫ్‌ అఫ్లియేషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. యూనివర్సిటీలకు వీసీలుగా ఐఏఎస్‌లను నియమించొద్దు. విద్యార్థి సంఘాలకు ఎన్నికలను నిర్వహించాలి. ఎయిడెడ్‌ విద్యాలయాలను ప్రభుత్వంలో విలీనం చేయాలి.

ఐటీఐలను సాంకేతిక శాఖ పరిధిలోకి తేవాలి. పాలిటెక్నిక్‌ తర్వాత నేరుగా బి.టెక్‌లో ప్రవేశం కల్పించకూడదు. ఏ ఏడాదికి ఆ ఏడాది విద్యాలయాల పనితీరును తెలిపే ర్యాంకింగ్‌ ఇచ్చేలా రాష్ట్ర స్థాయిలో తెలంగాణ స్టాండర్డ్‌ అసెస్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేయాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రస్తుతం 6 నుంచి 14 ఏండ్లలోపు వారికి ఉచిత విద్య ఉండగా, దానిని మూడేండ్ల నుంచి 18 ఏండ్ల వరకు పొడిగించాలి. రాష్ట్రంలో సరిపోయినంతగా గురుకులాలున్నాయి. కొత్త గురుకులాలను ఏర్పాటు చేయొద్దు. …అని విద్యా కమిషన్‌ సిఫారసులు చేసింది. కాగా నివేదికలో చట్టబద్ధత కల్పించాల్సిన, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాల్సిన అంశాలపై రిపోర్టును రూపొందించే బాధ్యతను ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కే.కేశవరావు నేతత్వంలోని కమిటీకి ముఖ్యమంత్రి అప్పగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -