Friday, February 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండ్రైవర్ల సొమ్ము దోపిడీపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి

డ్రైవర్ల సొమ్ము దోపిడీపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి

- Advertisement -

కరీంనగర్‌ ఏషియన్‌ పెయింట్‌ డ్రైవర్ల సమ్మెకు మద్దతు
ఏషియన్‌ పెయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ యజమానుల ఆగడాలు అరికట్టాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హెచ్చరిక

నవతెలంగాణ- కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఏషియన్‌ పెయింట్స్‌ సంస్థలో పని చేయించుకుని కూలీ డబ్బులు చెల్లించకుండా, పైగా ప్రతి ట్రాన్స్‌పోర్టు వాహనం నుంచి అక్రమంగా రూ. 2800 వసూలు చేస్తున్న యాజమాన్యంపై తక్షణమే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. కార్మికుల శ్రమను దోచుకుంటూ, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న గంప వెంకట్‌ లాజిస్టిక్స్‌, దుబ్బ భూషణం ట్రాన్స్‌పోర్ట్‌ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌లను కోరారు. కరీంనగర్‌ జిల్లా కేంద్ర శివారులోని ఏషియన్‌ పెయింట్స్‌ గోదాం వద్ద పది రోజులుగా సమ్మె చేస్తున్న ట్రాన్స్‌పోర్టు వాహనాల డ్రైవర్‌ కం ఓనర్స్‌ సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. కార్మిక శాఖ అధికారుల తీరుపై జాన్‌ వెస్లీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

‘కార్మిక చట్టాల ప్రకారం పని చేయించుకుని పైసలు ఇవ్వని యజమానులపై డీసీఎల్‌ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మీరు కార్మికుల సంక్షేమం కోసం పని చేస్తున్నారా లేక యజమానుల కోసమా?’ అని ప్రశ్నించారు. యజమానులకే కొమ్ముకావాలనుకుంటే ‘కార్మిక శాఖ’ అన్న బోర్డు తీసేసి ‘యజమానుల శాఖ’ అని పెట్టుకోవాలని అన్నారు. ఐదేళ్లుగా డ్రైవర్లతో చేయించుకున్న హమాలీ పనికి సంబంధించిన కూలీ డబ్బులను వెంటనే చెల్లించాలని, ప్రతి బండి నుండి వసూలు చేస్తున్న రూ. 2800 అక్రమ దందాను ఆపి, ఆ సొమ్మును వెనక్కి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కార్మికులను వేధిస్తున్న ట్రాన్స్‌పోర్ట్‌ యజమానులపై నాన్‌-బైలబుల్‌ కేసులు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి సమ్మెను విరమిం పజేయాలన్నారు. నిరసన తెలుపుతున్న కార్మికుల కు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని, సమస్య పరిష్కారం కాకపోతే ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమ, జిల్లా కార్యదర్శి ముకుంద రెడ్డి, ఉపాధ్యక్షులు ఎడ్ల రమేష్‌, సహాయ కార్యదర్శి పున్నం రవి, యూనియన్‌ నేతలు వెంకటేష్‌, వెంకట్‌ రెడ్డి, తిరుపతి, మహేష్‌, రమేష్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -