Friday, February 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం

జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -

కాలిబూడిదైన ఐదంతస్తుల వస్త్రదుకాణం
భారీ ఎత్తున ఎగిసిపడిన మంటలు
భయాందోళనకు గురైన స్థానికులు


నవతెలంగాణ- సిటీబ్యూరో/జూబ్లీహిల్స్‌
జూబ్లీహిల్స్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్‌ ప్రధాన రోడ్డుపై ఉన్న మాంగళ్య మంగళగౌరీ వస్త్ర దుకాణంలో గురువారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బిల్డింగ్‌ ముందు భాగంలో ఏర్పాటు చేసిన గోపురం డెకరేషన్‌కు మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది. ఐదో అంతస్తు వరకు భారీ ఎత్తున ఎగిసిపడిన మంటలతో దుకాణం కాలిబూడిదైంది. ఆ ప్రాంతమంతా దట్టమైన పోగ అలుముకోవడంతో స్థానికులు, సిబ్బంది భయాందోళనతో పరుగులు తీశారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు.

అగ్నిమాపక సిబ్బంది, హైడ్రా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో షాపింగ్‌ మాల్‌లో నలుగురు వ్యక్తులు ఉండగా.. వారు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఆ ప్రాంతం వాణిజ్యసముదాయం కావడంతో సమీపంలోని దుకాణాలకు మంటలు వ్యాపించకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు. వెంటనే స్పందించిన ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం చోటుచేసుకుందని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నామని తెలిపారు.

భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలి: ఎమ్మెల్యే
సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే వీ. నవీన్‌ యాదవ్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. హైడ్రాతోపాటు, ఫైర్‌ సిబ్బందితో మాట్లాడిన ఎమ్మెల్యే సహాయక చర్యలను వేగవంతం చేయాలన్నారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది, హైడ్రా సిబ్బంది అధునాతన పరికరాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని వ్యాపారులకు సూచించారు. ప్రజలు కూడా విద్యుత్‌ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు పాటించి, అగ్ని ప్రమాదాల నివారణకు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -