త్వరలో అంబేద్కర్ టవర్ ఏర్పాటు
ఢిల్లీ స్థాయి సివిల్స్ కోచింగ్ హైదరాబాద్‌లోనే : రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నవతెలంగాణ – ముషీరాబాద్
ప్రతిభావంతులైన దళిత విద్యార్థులకు అన్నిరంగాల్లో సమాన అవకాశాలు లభించాలంటే చదువు ఒక్కటే మార్గమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. దళితులకు ఉన్నత విద్య అందించడమే సర్కార్ లక్ష్యమని తెలిపారు. గురువారం 59 దళిత కులాల సంఘాల నాయకుల సమావేశం హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్‌లోని అంబేద్కర్ భవన్‌లో జరిగింది. ఈ సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడుతూ దళితులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్‌ను మోడర్న్ కోచింగ్ హబ్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
కాచిగూడ హాస్టల్ కాంప్లెక్స్‌ను రెసిడెన్షియల్ అకాడమిక్ సెంటర్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఢిల్లీ స్థాయి సివిల్స్ కోచింగ్ సౌకర్యాలను హైదరాబాద్‌లోనే అందించే దిశగా చర్య లు తీసుకుంటున్నామన్నారు.రానున్న రోజుల్లో విద్యార్ధుల కోసం కొత్త టెక్నాలజీతో డిజిటల్ లైబ్రరీలు, స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడంతో పాటు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ గెస్ట్ లెక్చరర్స్‌ను తీసుకోవడంతో పాటు మాక్ టెస్టులు, ఇంటర్వ్యూ గైడెన్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడతామని తెలిపారు. కోచింగ్ తీసుకునే అభ్యర్ధుల కోసం హాస్టల్, మెస్, స్టడీ హాల్స్ వంటి పూర్తి సదుపాయాలు కల్పిస్తామని వివరించారు.
సివిల్స్, గ్రూప్-1 గ్రూప్-2 కోచింగ్ కోసం మెరిట్ ఆధారంగా పారదర్శక ఎంపిక విధానం ఉంటుందని తెలిపారు. కోచింగ్ సెంటర్లు ఒక హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాకుండా ప్రతి జిల్లాకు విస్తరించేలా దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఎస్సీ యువతలో ఆత్మవిశ్వాసం పెంచే విధంగా మార్గదర్శకాలు రూపొందించి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీల ప్రాతినిధ్యం పెరిగే విధంగా ముందుకు సాగుతామని తెలిపారు. కోచింగ్ సెంటర్లను అకడమిక్ ఎక్సలెన్స్ సెంటర్స్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామన్నారు. తమిళనాడు మోడల్‌లా అత్యాధునిక సదుపాయాలతో నూతన భవనాలు నిర్మిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
దళితులకు ఉన్నత విద్య అందించడమే సర్కార్ లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



