జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఎం వి మధుసూదన్
శాస్త్రీయ సాగు విధానాలతో అధిక దిగుబడి
అశ్వరావుపేట శాస్త్రవేత్త శ్రీనివాస్
నవతెలంగాణ – బోనకల్
ఆయిల్ ఫామ్ పంట ఎంతో లాభదాయకమని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి ఎంవి మధుసూదన్ తెలిపారు. శాస్త్రీయ సాగు విధానాలను అవలంబించడం వలన అధిక దిగుబడి వస్తుందని అశ్వరావుపేట శాస్త్రవేత్త శ్రీనివాస్ తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలోనే గోవిందాపురం ఎల్, నారాయణపురం గ్రామంలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో ఆయిల్ పామ్ పంట ప్రాముఖ్యత, సాగు పద్ధతులు, అధిక దిగుబడులు సాధించే విధానాలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించారు.
అశ్వారావుపేట ఉద్యాన పరిశోధన శాస్త్రవేత్త శ్రీనివాస్, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఎం వి మధుసూదన్ రావు మాట్లాడారు. అశ్వారావుపేట ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంటలో అనుసరించాల్సిన శాస్త్రీయ సాగు విధానాలపై వివరించారు. ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం, నీటి నిర్వహణ, గెలల కోత సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై రైతులకు సాంకేతిక సూచనలు వివరించారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఎం వి మధుసూదన్ రావు మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. రాబోయే 30–40 సంవత్సరాలపాటు ఈ పంటకు స్థిరమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రైతులు ఆయిల్ పామ్ సాగుతో పాటు కూరగాయ పంటలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ఆయిల్ పామ్, కూరగాయ, సెరికల్చర్ పంటల సాగు ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలని రైతులకు సూచించారు.
ముఖ్య అతిధిగా నెటఫిమ్ డ్రిప్ అగ్రోనమిస్ట్ సుబ్బారావు మాట్లాడుతూ డ్రిప్ వలన కలుగు లాభాలు, డ్రిప్ ద్వారా మొక్కలకు నీటి తోపాటు ఎరువులు ఏ విధంగా పంపించాలి, అలాగే డ్రిప్ నిర్వహణ ఏ విధంగా చూసుకోవాలి,అలాగే మొక్కలకు ఎరువులు, పాటించవలసిన యాజమాన్యం పద్ధతులపై సలహాలు సూచనలు రైతులకు వివరించారు.ఈ కార్యక్రమం ద్వారా రైతుల్లో ఆయిల్ పామ్ సాగుపై ఆసక్తి పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోవిందాపురం ఎల్ గ్రామ సర్పంచ్ మంద కరుణ, పట్టు పరిశ్రమ డిడి ముత్యాలు, సహాయ వ్యవసాయ సంచలకుల స్వర్ణ విజయ్ చంద్ర, మధిర ఉద్యాన అధికారి విష్ణు, ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్ నవ్య, వెన్నెల, నెటఫిమ్ డ్రిప్ అగ్రోనమిస్ట్ సుబ్బారావు వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.


