చెంచుపెంటలో ఇంటింటి సర్వే ను సమర్థవంతంగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
నవతెలంగాణ – అచ్చంపేట
చెంచు పెంటల్లో ఆదివాసీ చెంచులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లు, ప్రధానమంత్రి జనధన్ పథకంలో కేటాయించిన లబ్ధిదారుల ఇండ్లను రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) స్వచ్ఛంద సంస్థ తో నిర్మాణాలను ఎంవోయూ కుదుర్చుకుని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ లో ఐటీడీఏ, గృహ నిర్మాణా శాఖల అధికారులు, ఆర్ డి టి సంస్థ ప్రతినిధులతో కలెక్టర్ చెంచుల ఇండ్ల నిర్మాణాలు, చెంచు ప్రజల సమగ్ర సర్వే నిర్వహణపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చెంచు పెంటల్లో చెంచు ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినప్పటికీ ఆర్థిక స్తోమత లేకపోవడంతో స్వయంగా ఇండ్లు నిర్మించుకోలేకపోతున్నందున అర్హులైన చెంచు ప్రజలకు ఇల్లు నిర్మించాలని ఉద్దేశంతో ఆర్డిటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇండ్ల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మెరకే ఇందిరమ్మ ఇండ్లను వేగవంతం చేయాలని సంస్థ ప్రతినిధులకు సూచించారు.
ఒక్కో ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు చొప్పున నిర్మాణ సంస్థకు చెల్లింపులు నేరుగా లబ్ధిదారుల తో కాకుండా ఐటీడీఏ ద్వారా చెల్లించేలా అందుకు అవసరమైన ఎంవోయూను నిబంధనలను అనుసరిస్తూ ఆ మేరకు కుదుర్చుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఐదు జిల్లాల పరిధిలో లబ్ధిదారులైన చెంచులకు 1488 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని, నాగర్ కర్నూల్ జిల్లాలో 536 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని ఆయా మంజూరైన ఇండ్లను నిర్మించి వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అదేవిధంగా ఐటీడీఏ పరిధిలోని 5 జిల్లాల పరిధిలో 2156 చెంచుపెంటల్లో నివసించే ప్రజల సమగ్ర సర్వేను నిర్వహించి అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆర్ డి టి సంస్థ ప్రతినిధులకు సూచించారు. సర్వేలు 42 అంశాలను పరిగణనలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో ప్రతి ఇంట్లో నివసించే ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రతి ఒకరికి ఆధార్, రేషన్ కార్డు, జన్ మన్ కార్డ్, ఆయుష్మాన్ భారత్, కిసాన్ కార్డ్, తదితర అన్ని ప్రభుత్వ పథకాల కు సంబంధించిన కార్డులు ప్రతి ఒక్కరికి అందించేందుకు అనుగుణంగా రానున్న మాసం రోజుల్లో క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి ప్రభుత్వ సైట్ లో అప్లోడ్ చేయాలని ఆర్డిటి సంస్థ ప్రతినిధులకు కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ పిడి సంగప్ప, ఐటీడీఏ మేనేజర్ జాఫర్ హుస్సేన్, ఆర్డిటి సంస్థ హ్యాబిటేషన్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, భవ్య నారాయణ, నాగరాజు, రామ్మోహన్, రాధ, తదితరులు పాల్గొన్నారు.



