ఇబ్బందులు పడుతున్న ఎన్యుమరేటర్లు
నవతెలంగాణ- జగిత్యాల టౌన్
జగిత్యాల జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే కి సంబంధించి జిల్లా వ్యాప్తంగా పలువురు నిరుద్యోగులతో పాటు ఆయా కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది కూడా డేటా ఎంట్రీ లో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 344039 కుటుంబాలకు సంబంధించిన డేటా ఎంట్రీని 2420 మంది ఎన్యుమరేటర్స్ డేటా ని పూర్తి చేశారు. దీనికి సంబంధించి రూ. 10204250 ఎన్యుమరేటర్స్ కు పంపిణీ చేయాల్సి ఉండగా వారం రోజుల క్రితం జిల్లాలోని ఎంపీడీవోల ఖాతాకు డబ్బులు వచ్చి ఉన్నాయి. పలుచోట్ల ఎంపీడీవోలు ఆపరేటర్లను పిలిచి డబ్బులు పంపిణీ చేస్తుండగా మరికొన్ని చోట్ల ఎన్యుమరేటర్లు ఎంపీడీవో కార్యాలయాలకు వెళ్లి ఆరా తీయగా మరో వారం రోజుల వరకు పంపిణీ చేసే ఉద్దేశం ఆయా మండలాల ఎంపీడీవోలకు లేదని స్పష్టం అవుతుంది. సుమారు 18 నెలలు గడిచిన గాని ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు డబ్బులు పంపిణీ చేయలేకపోయారు.
ఇప్పుడు ఎంపీడీవో ల ఖాతాలలో డబ్బులు జమ అయిన గాని కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరికొన్నిచోట్ల ఒక్కొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన డేటా ఎంట్రీ కి 30 రూపాయలు ఇస్తామని తెలిపిన అధికారులు ప్రస్తుతం 20 రూపాయలు పంపిణీ చేస్తూ అందులో కూడా చేతివాటం ప్రదర్శిస్తుండడం గమనార్హం.
గతంలో సాధారణ ఎన్నికలలో విధులు నిర్వహించిన వాహన డ్రైవర్లకు రూ. 1040 ఇవ్వాల్సింది పోయి 800 రూపాయలు మాత్రమే పంపిణీ చేసినారు. ఇదేమని డ్రైవర్లు ప్రశ్నిస్తే అక్కడి నుండి అదేవిధంగా వచ్చాయని సిబ్బంది సమాధానం తెలుపడం జరిగింది. అంతేకాకుండా వాహనాలలో డీజిల్ పోయించడంలో కూడా అధికారులు చేతివాటం ప్రదర్శించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక లీటర్ కు 5 కిలోమీటర్ల చొప్పున ఆయా వాహనాలలో డీజిల్ ను పోయించాల్సింది పోయి అధికారులు పలుచోట్ల తక్కువ మొత్తంలో పోయించి ఆబాసు పాలయ్యారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతగా అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో ఇటువంటి తప్పిదాలు జరగకుండా పంపిణీ విధానం సక్రమంగా జరిగేలా చూడాలని పలువురు ఏన్యుమరేటర్లు కోరుచున్నారు.


