కేజ్రీవాల్, సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా 23 మందికి క్లీన్‌చిట్
విచారణాధికారిపై శాఖాపరమైన విచారణకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశం
ఢిల్లీ హైకోర్టులో అప్పీలు చేస్తామన్న సీబీఐ
న్యూఢిల్లీ : లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, అమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేత మనీశ్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఆమె ఆడిటర్ బుచ్చిబాబు సహా 23 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. కేసు విచారణలో సీబీఐ వ్యవహరించిన తీరును రౌస్ అవెన్యూ కోర్టు(సీబీఐ ప్రత్యేక కోర్టు)ల ప్రత్యేక న్యాయమూర్తి జితేంద్రసింగ్ తన 598 పేజీల తీర్పులో తీవ్రంగా తప్పుపట్టారు. విచారణలో చోటుచేసుకున్న అనేక లోపాలను ఆయన తన తీర్పులో ప్రత్యేకంగా ఎత్తిచూపారు. అయితే ఈ తీర్పుపై ఢిల్లీ హైకోర్టు లో అప్పీలు చేయాలని సీబీఐ నిర్ణయించింది.
ఆధారాల్లేవ్..
ఈ కేసులో 18వ నిందితుడిగా చూపిన అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముడుపులు స్వీకరించారని చెప్పడానికి ప్రాసిక్యూ షన్ ఎలాంటి ఆధారాలు చూపలేకపోయిందని కోర్టు తెలిపింది. సహ నిందితులు, సాక్షులు ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా కేజ్రీవాల్‌పై ఆరోపణలు మోపారని, అయితే ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని నిరూపించడానికి అవసరమైన ఆధారాలు సమర్పించలేకపోయారని చెప్పింది. మోసం, వంచన ద్వారా అక్రమంగా లాభాన్ని పొందాలని అనుకున్నారని, క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారని నిరూపించడానికి ఎలాంటి ఆధారా లు చూపకుండా, కేవలం విధాన నిర్ణయాలకు అనుమతి ఇచ్చారన్న కారణంతో అభియోగం మోపలేరని స్పష్టం చేసింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీటును పరిగణనలోకి తీసుకునేందుకు న్యాయమూర్తి నిరాకరించారు.
పీఎంఎల్‌ఏ అమలు తీరుపై ఆందోళన
మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) అమలు జరుగుతున్న తీరుపై రౌస్ అవెన్యూ కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. హడావిడిగా దర్యాప్తు చేయడం, అరెస్టులకు పూనుకోవడం రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని తెలిపింది. నేరాన్ని ప్రాథమికంగా నిరూపించక ముందే పీఎంఎల్‌ఏ కింద అరెస్టులు చేసి, సుదీర్ఘకాలం జైలులో ఉంచడం తగదని న్యాయస్థానం చురకలు అంటించింది. ప్రాథమికంగా నేరం ఏదీ లేకుంటే మనీ లాండరింగ్ కేసు నిలవదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగం హామీ ఇచ్చిందంటూ న్యాయం అనేది కేవలం ఊహాగానాల ఆధారంగా నిర్ణయం తీసు కోరాదనీ, సాక్ష్యాలు అవసరమవుతాయని తెలిపింది.
ఆయనపై విచారణ జరపండి
విచారణ తీరుతెన్నులపై రౌస్ అవెన్యూ కోర్టు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విచారణాధికారిపై శాఖాపరమైన దర్యాప్తు జరపాలని ఆదేశించింది. నిందితులపై సరైన ఆధారాలు లేకుండా కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణ మొత్తం లోపభూయిష్టంగానే జరిగిందని వేలెత్తి చూపింది. కుట్ర జరిగిందని చెప్పడానికి సీబీఐ ఎలాంటి ఆధారాలు చూపలేకపోయిందని, కేవలం ఉహాగానాల పైనే అభియోగాలు మోపిందని మండి పడింది. ఎక్సైజ్ విధానంపై ముగ్గురు న్యాయ నిపుణులు వెలిబుచ్చిన అభిప్రాయాలు తమ కేసుకు మద్దతు ఇస్తున్నాయని గతంలో సీబీఐ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ దానిపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. తీర్పును స్వాగతించిన అమ్‌ఆద్మీ పార్టీ…అది ప్రాసిక్యూషన్ వాదనకు ఎదురు దెబ్బ అని అభివర్ణించింది. ప్రాసిక్యూషన్ వాదనలను కోర్టు సమర్ధవంతంగా తిప్పికొట్టిందని తెలిపింది.
ఆప్ అంతానికి మోడీ, షా కుట్ర : కేజ్రీవాల్
తీర్పు వెలువడిన తర్వాత కేజ్రీవాల్ భావోద్వే గానికి గురై కన్నీటిపర్యంతమయ్యారు. పక్కనే ఉన్న సిసోడియా ఆయనను ఓదార్చారు. ప్రజా జీవితంలో నిజాయితీని మినహా సంపాదించుకున్నది ఏమీ లేదని వ్యాఖ్యానించారు. కేసు మొత్తం కల్పితమేనని, చివరికి అన్యాయం, తప్పుడు పనులు వీగిపోయాయని చెప్పారు. కేవలం సత్యమే నిలిచిందని అన్నారు. అధి కారం కోసం ప్రభుత్వాలను కూల్చవద్దని ప్రధాని మోడీకి హితవు పలికారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉన్నదని అంటూ ‘ఆప్’ను అంతం చేయడానికి ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కలిసి పెద్ద రాజకీయ కుట్ర పన్నారని ఆరోపించారు. ఆప్‌కు చెందిన ఐదుగురు నేతలను జైలుకు పంపారని, సీఎంగా ఉన్న తనను కూడా వదల్లేదని విమర్శించారు. తాను అవినీతిపరుడిని కానని, న్యాయస్థానం కూడా అదే విషయాన్ని చెప్పిం దని అన్నారు. ఢిల్లీ శాసనసభకు మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రధానికి సవాలు విసిరారు. ఎన్నికల కు మోడీ సిద్ధమా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో బీజేపీ పది స్థానాలకు మించి గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. కోర్టు తీర్పుపై సిసోడియా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఎప్పటికీ సత్యమే గెలుస్తుం దని చెప్పారు. తనను, కేజ్రీవాల్‌ను అవినీతిపరులుగా చిత్రీకరించేందుకు బీజేపీ, దాని కనుసన్నల్లో పనిచేస్తు న్న దర్యాప్తు సంస్థలు అనేక రకాలుగా ప్రయత్నాలు చేశాయని ధ్వజమెత్తారు. కోర్టు తీర్పు నేపథ్యంలో కేజ్రీ వాల్ సహా పలువురు పార్టీ నేతలు రోడ్‌షో నిర్వహించారు.
‘సౌత్ గ్రూప్’ అనడమేమిటి?
మద్యం కేసులో నిందితులైన కొందరిని వారి ప్రాంతాన్ని బట్టి ‘సౌత్ గ్రూప్’ అని పిలవడమేమిటని న్యాయస్థానం నిలదీసింది. ఇది సరైన పద్ధతి కాదని అభిప్రాయపడింది. సౌత్ గ్రూప్ అనే పదానికి చట్టంలో ఎక్కడా చోటు లేదని గుర్తు చేసింది. నేర నిరూపణకు ప్రాంతం లేదా నిందితులు ఎక్కడి వారు అనే దానితో సంబంధం ఏముంటుందని ప్రశ్నించింది. మిగిలిన నిందితులకు ‘నార్త్ గ్రూప్’ అనే పేరు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించింది. ఇది పక్షపాతపూరితంగా కన్పిస్తోందని మందలించింది. ప్రాంతాన్ని ఆధారంగా చూసుకొని పిలిస్తే ప్రజలకు, కోర్టుకు తప్పుడు సంకేతం వెళుతుందని అభిప్రాయపడింది. కేసును ఎదుర్కొంటున్న వ్యక్తి చేసిన పని ఏమిటన్నదే ప్రధానం కానీ అతను ఎవరు, ఎక్కడి వాడు అనేది ముఖ్యం కాదని చెప్పింది. జాతి, ప్రాంతం వంటి అంశాలను కేసులోకి లాగడం మంచిది కాదని హితవు పలికింది.
ఏమిటీ లిక్కర్ కుంభకోణం ?
ఢిల్లీలో కేజ్రీవాల్ నేతృత్వంలోని అమ్ ఆద్మీ ప్రభుత్వం 2021 నవంబరులో మద్యం పాలసీని రూపొందించింది. దేశ రాజధానిలో మద్యం వ్యాపారాన్ని ప్రక్షాళన చేసి, నియంత్రించాలన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకొచ్చింది. మద్యం విధానం అమలులోకి వచ్చిన కొన్ని నెలల తర్వాత బీజేపీ వివాదాన్ని రేపింది. ఆప్ ప్రభుత్వం తన ఖజానాను నింపుకునేందుకు మద్యం మాఫియాతో కుమ్మక్కు అయిందని ఆరోపించింది. 2022లో ఈ విధానాన్ని రద్దు చేశారు. అదే సంవత్సరం జూలైలో లెఫ్టినెంట్ గవర్నర్ వినరుకుమార్ సక్సేనాకు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసు పెట్టారు. విధాన రూపకల్పనలో అనేక లోపాలు, లొసుగులు ఉన్నాయని అందులో తెలియజేశారు.
కేజ్రీవాల్‌కు క్లీన్‌చిట్ స్వాగతిస్తున్నాం సామాజిక కార్యకర్త అన్నా హజారే
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు న్యాయస్థానం క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే స్వాగతించారు. న్యాయవ్యవస్థే అత్యున్నతమైందని, కోర్టు తీర్పును అంగీకరించాలన్నారు. సొంతగా లేదా పార్టీ గురించి ఆలోచించకుండా.. సమాజం, దేశం కోసం పనిచేయాలని ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు సలహా ఇచ్చారు. గతంలో కేజ్రీవాల్‌పై చేసిన విమర్శల గురించి ప్రస్తావిస్తూ.. తాను వ్యాఖ్యలు చేసినప్పుడు న్యాయస్థానం ఎటువంటి తీర్పు చెప్పలేదన్నారు. ఇంత పెద్ద దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు, కులాలు, మతాలు ఉన్నప్పటికీ.. న్యాయవ్యవస్థ వల్లే దేశం సరైన మార్గంలో నడుస్తోందన్నారు. మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో మాట్లాడిన ఆయన.. బలమైన న్యాయవ్యవస్థ లేకుంటే నేరస్తులదే పైచేయి అయ్యేదని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ ఎటువంటి తప్పు చేయలేదని న్యాయస్థానం పేర్కొందని, ఆ తీర్పును మనం గౌరవించాల్సిందేనని ఆయన అన్నారు. కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తన కార్యకర్తలేనని తెలిపారు.



