Saturday, February 28, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుభూదాన్‌ అక్రమార్కుల నిగ్గు తేల్చాలి

భూదాన్‌ అక్రమార్కుల నిగ్గు తేల్చాలి

- Advertisement -

కమ్యూనిస్టుల చరిత్ర యూట్యూబ్‌, వెబ్‌ పెయిడ్‌ బ్యాచ్‌కి ఏం తెలుసు
వామపక్షాల పోరాట ఫలితంగానే ఖమ్మంలో కాలనీల ఏర్పాటు
బడాబాబులు ఆక్రమించుకున్న భూములు అధికారులకు కనిపించడం లేదా?
నిర్వాసితులకు తక్షణసాయం కింద రూ.లక్ష ప్రకటించాలి
ఇండ్లు కోల్పోయిన వారందరికీ న్యాయం చేయాలి : విలేకర్ల సమావేశంలో వామపక్ష పార్టీల నేతలు
నున్నా నాగేశ్వరరావు, దండి సురేష్‌, ఆవునూరి మధు, గోకినేపల్లి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-గాంధీచౌక్‌
ఇందిరమ్మ రాజ్యం అంటే నిరుపేదల ఇండ్లను కూల్చి వారిని మెడపట్టి గెంటేయడమేనా అని వామపక్ష నాయకులు ప్రశ్నించారు. ఇండ్ల కూల్చివేత సందర్భంగా ఎలాంటి నోటీసులూ లేకుండా వారి సామన్లు కూడా తీసుకోనివ్వకుండా 2వేల మంది పోలీసులు, వందలాది మంది అధికారులను ఏర్పాటు చేసి తెల్లవారుజాము నుంచే కూల్చివేయడం గాజాపై ఇజ్రాయిల్‌ చేసిన దమనకాండను గుర్తుచేసిందన్నారు. ఖమ్మం నగరంలోని సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్‌లో శుక్రవారం వామపక్షపార్టీల నేతలు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలోని వెలుగుమట్ల ప్రాంతంలో ఉన్న భూదాన్‌ భూముల్లో 10 సంవత్సరాల క్రితం నుంచి నిరుపేదలు పట్టాలు పొంది 600 మంది నివసిస్తున్నారని తెలిపారు. వారి అందరి ఇండ్ల్లు కూల్చి వేయడం వల్ల వారు రోడ్డున పడ్డారని, విద్యార్థులు ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను కూడా రాయలేదన్నారు. 2014 నుంచి బడా బాబుల భూములను క్రమబద్ధీకరణ చేస్తున్న ప్రభుత్వం పేదల ఇండ్లను ఎందుకు క్రమబద్దీకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే అక్కడున్న నిరుపేదల ఇండ్లను కూల్చివేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. మొత్తం 62 ఎకరాల్లోని 32 ఎకరాల్లో ఇండ్లను కూల్చి రూ.250 కోట్ల ఆస్తిని స్వాధీనం చేసుకున్నామని గొప్పలు చెప్పుకుంటున్న వారు మిగతా స్థలం ఏమైందో నిగ్గు తేల్చాలని డిమాండ్‌ చేశారు. నిరుపేదలు ఆక్రమణదారులు కాదని, కూలీ పనులు చేసుకుని అప్పులు తెచ్చుకొని ఇండ్లు నిర్మించుకున్న వారన్నారు. అటువంటి వారి ఇండ్లను కూల్చివేసి ప్రభుత్వ ఆస్తిని కాపాడామని అధికారులు చెప్పడం సిగ్గు చేటన్నారు. జిల్లా కలెక్టర్‌ ప్రజల అధికారా లేక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారా? అని ప్రశ్నించారు. ఆ భూమిని ప్రభుత్వం బడాబాబులకు కట్టబెట్టే యోచనలో ఉన్నట్టు అనుమానాలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. జిల్లా యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించి నిర్వాసితులకు న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వ నిర్వాహకం వల్ల నిర్వాసితులు సర్వస్వం కోల్పోయి తినడానికి తిండి కూడా దొరకక అల్లాడుతున్నారని, వారికి తక్షణ సాయంగా లక్షరూపాయలు అందించాలన్నారు. ఇండ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ అదే స్థలంలో ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కమ్యూనిస్టుల చరిత్ర పిల్లకాకులకు ఏం తెలుసు..!
తెలంగాణ సాయుధ పోరాటం, ముదిగొండ భూపోరాటం వంటి మహాత్తర పోరాటాల ద్వారా పేదలకు ఇండ్లు, స్థలాలు, భూములు సాధించినటువంటి కమ్యూనిస్టు పార్టీల చరిత్ర కొంతమంది యూట్యూబ్‌, వెబ్‌ పెయిడ్‌ బ్యాచ్‌కు ఏం తెలుస్తుందని వామపక్షనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్షాల పోరాటాలు లేకుండా.. వాళ్ళు మరణించకుండా, దెబ్బలు తినకుండా, నిర్బంధాలు ఎదుర్కోకుండా ఖమ్మం నగరంలోని పేదలు నివసించే రమణగుట్ట, దానవాయిగూడెం, రామన్నపేట, అగ్రహారం, దంసలాపురం, వైఎస్‌ఆర్‌ కాలనీ వంటి కాలనీలు ఏర్పడలేదని తెలిపారు. ఇందిరమ్మ పథకం కూడా తమ పోరాటాల వల్లనే వచ్చిందన్నారు. అటువంటి వామపక్ష పార్టీలపై కొన్ని యూట్యూబ్‌, వెబ్‌ ఛానల్‌ జర్నలి స్టులు కారుకూతలు తమ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. చరిత్ర తెలియకపోతే తెలుసుకొని ప్రచారం చేయాలని, అంతేకాని ప్యాకేజీలు తీసుకొని జర్నలిజం విలువలు దిగజార్చొద్దన్నారు. లేనియెడల ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ విలేకర్ల సమావేశంలో ఆయా పార్టీల రాష్ట్ర, జిల్లా, నగర నాయకులు వై.విక్రం, మేకల శ్రీనివాస్‌, ఆవుల అశోక్‌, పాముల మోహన్‌, రాజు, జి.మస్తాన్‌, శంకర్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -