ప్రజాస్వామ్య మార్గంలోనే సేవలందించగలం
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలతో సీఎం రేవంత్‌రెడ్డి
ముఖ్యమంత్రితో భేటీ అయిన మావోయిస్టు నేతలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
హింసాయుత మార్గంలో ఏమీ సాధించలేమనీ, ప్రజాస్వామ్య మార్గంలోనే శాంతియుతంగా ప్రజలకు సేవలందించడానికి వీలవుతుందనీ, ఆ మార్గాన్ని మావోయిస్టులు ఎంచుకున్నందుకు అభినందనీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సచివాలయంలో ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు పిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మరో కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, మావోయిస్టు రాష్ట్ర మాజీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, రాష్ట్ర కమిటీ సభ్యులు నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న, కేంద్ర కమిటీ సభ్యులు పుల్లూరి ప్రసాదరావు, మరో కేంద్రకమిటీ సభ్యురాలు సుజాతలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారితో సీఎం పలు అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి, ఇంటలిజెన్స్ చీఫ్ విజరుకుమార్, ఎస్ఐబీ ఐజీ బీ సుమతి ఈ సమావేశంలో పాల్గొన్నారు. మావోయిస్టు మాజీ అగ్రనేతలను ఆప్యాయంగా పలుకరించిన ముఖ్యమంత్రి వారు ప్రజాస్వామ్యయుతంగా తమ భవిష్యత్ జీవితాన్ని గడపడానికి అజ్ఞాతం వీడి రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదే దారిలో మిగితా వారు కూడా వెలుపలికి రావాలని విజ్ఞప్తి చేశారు. మారుతున్న కాలానికి అనుగుణం గా మావోయిస్టులు తమ పంథాను మార్చుకుని ప్రజాస్వామ్య మార్గంలో ప్రజలకు సేవ చేసుకోవడా నికి అనేక మార్గాలున్నాయని సూచించారు. ముఖ్యంగా మావోయిస్టుల పునరావాసం కోసం, వారు సభ్య సమాజంలో గౌరవప్రదంగా నూతన జీవితాన్ని గడపడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని గుర్తుచేశారు. పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న మావోయిస్టు పునరావాస పథకాలను పరిశీలించి మరింతగా ఈ సహాయాన్ని పెంచడానికి కూడా తాము ఆలోచన చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా స్నేహపూరిత వాతావరణంలో సాగిన ఈ సమావేశంలో ఒక్కో మావోయిస్టు నాయకునితో ముఖ్యమంత్రి ముఖాముఖిగా మాట్లాడుతూ పలు అంశాలపై చర్చించారు.
లొంగిపోయిన మావోయిస్టులు తమకు ఒక్కొక్కరికి ఐదెకరాల భూమిని కేటాయించాలని కోరగా… అది సాధ్యం కాదని సీఎం తోసిపుచ్చారు. అలాంటప్పుడు ఒక్కొక్కరికి కోటి రూపాయల రివార్డును ఇవ్వాలని అడగ్గా…… పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జైళ్లలో మగ్గుతున్నమావోయిస్టులను కలిసేందుకు తమకు అనుమతివ్వాలని కోరగా…. దాందేముంది, తప్పకుండా అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మావోయిస్టు పునరావాస పథకాలకు ఆకర్షితులై ఇప్పటి వరకు 598 మంది మావోయిస్టులు లొంగుబాటులో నడిచారని వివరించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపునకు స్పందించి ప్రస్తుతం నలుగురు అగ్రనేతలు జనజీవన స్రవంతిలో కలవడానికి వెలుపలికి వచ్చారని తెలిపారు
.
రక్షణ కల్పించండి-దేవ్‌జీ
మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ మాట్లాడుతూ తాము ఎలాంటి ప్రాణాపాయం లేకుండా లొంగిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశం పట్ల కతజ్ఞతలు తెలిపారు. అయితే పునరావాసానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, రివార్డు డబ్బును మరింత పెంచాలని కోరారు. తమకు రక్షణ కల్పిస్తూ జనజీవన స్రవంతిలో ముందుకు సాగడానికి తగిన వాతావరణాన్ని కూడా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు స్పందించిన ముఖ్యమంత్రి, లొంగిపోయిన మావోయిస్టుల రక్షణ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం ఉండదనీ, ఆ విషయంలో పోలీస్ అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. సమావేశం అనంతరం వెలుపలికి వచ్చిన మావోయిస్టు అగ్రనేతలు మీడియాతో ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
పోలీస్‌శాఖలో మహిళలకు ప్రాధాన్యత వార్షిక పత్రికల ఆవిష్కరణలో సీఎం
పోలీస్‌శాఖలో మహిళలకు మరింత ప్రాధాన్యాతనిస్తూ వారి ఎదుగుదలకు తగిన అవకాశాలను కూడా కల్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సచివాలయంలో జాతీయ మహిళా పోలీస్ కాన్ఫరెన్స్, పోలీస్ అకాడమీకి చెందిన వార్షిక పత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ శాఖలో ఐపీఎస్ అధికారులు మొదలుకొని కానిస్టేబుల్ స్థాయి వరకు విధులు నిర్వహిస్తున్న మహిళలు మంచి ఫలితాలను సాధిస్తున్నారని అభినందించారు. ముఖ్యంగా పురుష అధికారులతో పోటీ పడుతూ వారు అత్యంత క్లిష్టమైన విధులను కూడా సునాయాసంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇటీవల జరిగిన జాతీయ మహిళా పోలీస్ కాన్ఫరెన్స్‌లో పోలీస్‌శాఖలో మహిళల ప్రాధాన్యతను పెంచడానికి అనువైన పలు సిఫార్సులు చేశారనీ, వాటిని ప్రభుత్వం సానుకూల దృష్టితో పరిశీలిస్తున్నదని తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మహిళా పోలీసుల సంక్షేమం, పోస్టింగ్స్‌లో వారికివ్వాల్సిన ప్రాధాన్యత తదితర అంశాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫారసు చేయాలని సూచించారు. టీజీసీఎస్బీ డైరెక్టర్ జనరల్ షికా గోయల్ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓలుగా మహిళల సంఖ్యను పెంచడానికి కృషి చేయాలనీ, ఇతర కీలక బాధ్యతల్లో వారికి అవకాశం పెంచాలని తదితర సూచనలు చేశారు. కార్యక్రమంలో పోలీస్ అకాడమీ డైరెక్టర్ జనరల్ అభిలాష బిస్ట్, హోంగార్డ్స్ అదనపు డీజీ స్వాతి లక్రా, సీఐడీ డీజీ చారుసిన్హా, ఎస్ఐబీ ఐజీ సుమతితో పాటు పలువురు మహిళా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
హింసతో ఏం సాధించలేం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



