ప్రజల కోసం ఉద్యోగులు నిలబడాలి : ఉద్యోగ సంఘ నాయకులతో డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘ఉద్యోగుల కోసం ప్రభుత్వం నిలబడుతుంది. ఉద్యోగులు ప్రజల కోసం నిలబడాలి’ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీం, రూ. కోటి ప్రమాద బీమా, సహజ మరణానికి రూ.10 లక్షల బీమా, విద్యా విధాన పరిషత్తు ఉద్యోగులను 010 పద్దు కింద తీసుకురావడంలో దిశా నిర్దేశం చేసిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లోని ప్రజా భవన్లో ఉద్యోగ సంఘ నాయకులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఉద్యోగులను బాగా చూసుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రజా ప్రభుత్వ పాలనలో చేపట్టే ప్రతి అంశం చివరి వ్యక్తి వరకు చేరే కార్యక్రమాన్ని ఉద్యోగులతో చేయించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఉద్యోగ వ్యవస్థ బలంగా ఉండాలనీ, వారి కుటుంబాలు భరోసాతో ఉండాలని కోటి రూపాయల ప్రమాద బీమా, హెల్త్ స్కీం తీసుకొచ్చామని చెప్పారు. ఆర్దిక ఇబ్బందులను అధిగమిస్తూ ప్రజలకు వ్యవస్థలు, సంస్థలు ఉపయోగపడాలనేది తమ ప్రభుత్వ కోరికని చెప్పారు. రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలుండగా 1.02 కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ప్రతి పథకం ప్రజల వద్దకు తీసుకెళ్ళేందుకు 99రోజుల కార్యక్రమాన్ని తీసుకొచ్చామని వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సీరియస్గా తీసుకొని యధాతథంగా కింది వరకు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు, దామోదర్ రెడ్డి, సదానంద్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, బి. శ్యామ్, దాస్య నాయక్, వెంకట్ రెడ్డి,ఉమా దేవి, డాక్టర్ రామారావు, షౌకత్ హుస్సేన్, వెంకట్, సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



