Saturday, February 28, 2026
E-PAPER
Homeజాతీయంజేఎన్‌యూలో పోలీసుల క్రూరత్వం, ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన

జేఎన్‌యూలో పోలీసుల క్రూరత్వం, ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన

- Advertisement -

ఖండించిన ఐద్వా
న్యూఢిల్లీ :
జేఎన్‌యూలో విద్యార్థులపై పోలీసుల క్రూరత్వాన్ని, ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనను అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) తీవ్రంగా ఖండించింది. గురువారం సాయంత్రం విద్యార్థులు నిర్వహించిన మార్చ్‌ శాంతియుతంగా సాగుతున్నప్పటికీ వారిపై పోలీసులు జలఫిరంగులు, బాష్పవాయువును ప్రయోగించడాన్ని, భౌతికదాడిని ఐద్వా విమర్శించింది. ముఖ్యంగా సివిల్‌ డ్రెస్‌ల్లో ఉన్న పురుష పోలీసులు మహిళా విద్యార్థులపై చేయిచేసుకున్నారనే వార్తలపై ఐద్వా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కుల వివక్ష వ్యాఖ్యలు చేసిన వైస్‌ ఛాన్సలర్‌ రాజీనామా చేయాలని, నలుగురు ఆఫీస్‌ బేరర్లను బహిష్కరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌తో పది రోజులుగా జరుగుతున్న సమ్మెపై ప్రభుత్వ ప్రాయోజిత హింస జరిగిందని ఐద్వా ఈ ప్రకటనలో విమర్శించింది. ఇది కేవలం స్థానిక సమస్య కాదని ప్రజాస్వామ్య హక్కులు, లింగ సమానత్వం, విద్యా సంస్థల ప్రాథమిక సమగ్రతపై జరిగిన తీవ్రమైన దాడిగా ఐద్వా పేర్కొంది. విద్యార్థుల డిమాండ్లపై చర్చల్లో పాల్గొనడానికి కూడా జేఎన్‌యూలో అధికారులు నిరాకరించిన ఫలితంగానే విద్యార్థులు ఆందోళనకు దిగారని ఐద్వా తెలిపింది. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి బదులుగా అధికారులు హింసను ప్రేరేపించారని ఐద్వా విమర్శించింది. అరెస్టు చేసిన విద్యార్థుల్లో కొంతమందిని విడుదల చేసినా ఇంకా 14 మంది నిర్భంధంలోనే ఉన్నారని ఐద్వా తెలిపింది. 14 మంది విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలని, వైస్‌ ఛాన్సలర్‌ రాజీనామా చేయాలని ఐద్వా డిమాండ్‌ చేసింది. ఆఫీస్‌ బేరర్లపై బహిష్కరణ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేసింది. మహిళా విద్యార్థులపై శారీరక వేధింపులకు కారణమైన పోలీసులపై ఉన్నతస్థాయి దర్యాప్తు నిర్వహించాలని ఐద్వా డిమాండ్‌ చేసింది. అలాగే జెఎన్‌యులో జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన ప్రారంభించనున్నట్టు ఐద్వా ప్రకటించింది. అధికారుల వైఫల్యాన్ని కాపాడ్డానికి విద్యార్థుల భద్రత, గౌరవాన్ని పణంగా పెడుతుంటే మౌనంగా ఉండమని ఐద్వా తెలిపింది. జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావాన్ని ప్రకటించింది. న్యాయం కోసం జరుగుతున్న ఈ పోరాటంలో తమతో చేతులు కలపాలని దేశానికి ఐద్వా పిలుపునిచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -