– యువత క్రీడల్లో రాణించాలి
– గంజాయి డ్రగ్స్ నిర్మూలనకై యువత భాగస్వామ్యం కావాలి
– షహీద్ భగత్ సింగ్ స్మారక యువజనోత్సవాల ప్రారంభసభలో వక్తలు
నవతెలంగాణ హైదరాబాద్: గంజాయి డ్రగ్స్ నిర్మూలనకై యువత భాగస్వామ్యం కావాలి. క్రీడలు యువతలో స్నేహాభావాన్ని పెంపొదిస్తాయని ఓయూ రిజిస్టర్ నరేష్ రెడ్డి, వాలీబాల్ మాజీ జాతీయ క్రీడాకారుడు కిరణ్ రెడ్డి, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్ లు అన్నారు. డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షహీద్ భగత్ సింగ్ స్మారక యువజనోత్సవాల సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో ‘సి` గ్రౌండ్ లో షహీద్ భగత్ సింగ్ హైదరాబాద్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓయూ రిజిస్టర్ నరేష్ రెడ్డి, వాలీబాల్ జాతీయ మాజీ క్రీడాకారుడు కిరణ్ రెడ్డిలు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా, గంజాయి, డ్రగ్స్ మాదకద్రవ్యాల బారిన పడకుండా ఉండి సంపూర్ణ ఆరోగ్యానికై విద్యార్థి, యువత క్రీడల్లో రాణించాలని అన్నారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని, స్నేహ భావాన్ని పెంపోదిస్తాయని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీలు చేస్తున్న కృషిని వారు అభినందించారు.

డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థి యువజనుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు, పోరాటాలు చేస్తూనే మరోవైపు విద్యార్థి, యువతలో దాగి ఉన్న సృజనాత్మకతను, నైపుణ్యాన్ని వెలికితీసేందుకు, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు ఈ క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ముందుంటుందన్నారు. ప్రభుత్వాలు క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చి క్రీడాకారులను ప్రోత్సహించాలన్నారు. అదేవిధంగా అనేకమంది విద్యార్థులు, యువత గంజాయికి డ్రగ్స్ కు బానిసలుగా మారి బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకొని ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు దూరమై కుటుంబాలకు భారమవుతున్నారని అన్నారు.యువతను మత్తులో ముంచి చిత్తు చేసే గంజాయి, డ్రగ్స్ అక్రమ వినియోగానికి అడ్డుకట్ట వేయాలని అన్నారు. గంజాయి డ్రగ్స్ వద్దు ఆరోగ్యం ఆటలే ముద్దు అని అన్నారు.
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, టీ10 సీఈఓ సుందర్ రెండవ మ్యాచ్ ను టాస్ వేసి ప్రారంబించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగత్ సింగ్ స్మారక యువజన ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా మార్చి 23వ తేదీ వరకు బహుముఖ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విద్యార్థి యువత పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభంలో డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.ఎల్ మూర్తి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లెనిన్, కె.అశోక్ రెడ్డి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జావిద్, మాజీ నాయకులు మహేందర్, జగదీశ్ టి.మహేందర్, విజయ్, ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా నాయకులు నాగేందర్, రాజయ్య, దేవేందర్, రమ్య, రజనీకాంత్, శ్రీమాన్, అర్జున్, శ్రీకాంత్, ప్రవీణ్, అంజి, అశ్వాక్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.





