నవతెలంగాణ – కామారెడ్డి
సివి రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక అక్షర ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవ వేడుకలను విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు స్వయంగా తయారు చేసి ప్రదర్శించిన పలు శాస్త్రీయ నమూనాలు, ఆవిష్కరణలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా “మిస్సైల్స్” నమూనా ద్వారా మన దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన క్షిపణుల ప్రాధాన్యతను, దేశ భద్రత, సైన్స్ రంగంలో సాధించిన పురోగతిని వివరించారు.
“స్కేరీ హౌస్” అనే సృజనాత్మక ప్రదర్శన ద్వారా సాంఘిక మాధ్యమాల్లో వ్యాపించే పుకార్లు, వాటి దుష్ప్రభావాలు, వాటికి బానిసలైన వారు ఎలా అప్రమత్తంగా ఉండాలనే అంశాలను వినూత్నంగా తెలియజేశారు. ఈ ప్రదర్శన విద్యార్థులలో అవగాహన పెంచడమే కాకుండా సందర్శకులను ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎల్లయ్య , పాఠశాల కరెస్పాండెంట్ లోకేశ్ రెడ్డి , డైరెక్టర్ సంగీతా రెడ్డి , ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని విద్యార్థులను అభినందించారు.



