– జిల్లా సైన్స్ అధికారి దేవరాజ్..
నవతెలంగాణ – తుంగతుర్తి
విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీయడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు వేదికగా నిలుస్తాయని జిల్లా సైన్స్ అధికారి దేవరాజ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మేరీ మదర్ పాఠశాలలోని విద్యార్థులు నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఈ మేరకు విద్యార్థులు చిన్ననాటి నుండే కొత్త ఆలోచనలపై దృష్టిసారించి సాంకేతిక రంగంలో ఎదగాలని సూచించారు. రోజురోజుకు సాంకేతిక రంగంలో అనేక మార్పులు వస్తున్నాయని వాటికి అనుగుణంగా ఆలోచనలకు పదును పెట్టాలన్నారు.
సైన్స్ అంటేనే నిజమని ప్రకృతిలో దాగి ఉన్న ఎన్నో విషయాలను సైన్స్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.సైన్స్ ను అలవర్చుకుంటేనే జీవితంలో ముందుకు వెళ్ళగలమని పేర్కొన్నారు. నేటి సమాజంలోని సమస్యలకు పరిష్కారం సైన్స్ ఒక్కటే మార్గమని, అది సృజనాత్మక ఆలోచనలతోనే సాధ్యమవుతుందని వెల్లడించారు. విద్యార్థులు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మెర్సీ జాన్, వైస్ ప్రిన్సిపాల్ మెరినా, ఉపాధ్యాయులు గోపాల్ రావు, అశోక్, నబి, సతీష్ నాగరాజు, సుకన్య, సౌమ్య, ఉమ, స్వాతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



