ఎస్ వీరయ్య.. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు
నవతెలంగాణ – భువనగిరి
కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ చేస్తున్న తప్పుడు విధానాల వల్ల అమెరికా సామ్రాజ్యవాదం దేశం మీద మరింత పెరుగుతుందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు. శనివారం స్థానిక సుందరయ్య భవనంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు అధ్యక్షతన జరిగిన వర్క్ షాప్ లో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ .. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని అంబానీ లాంటి సంస్థలకు రాయితీలను కల్పిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను నిరుగార్చుతూ నిరుద్యోగాన్ని పెంచుతున్నారన్నారు.
రైతాంగాన్ని దివాలా తీస్తూ పరిపాలన సాగిస్తున్నాడన్నారు. అమెరికా భారతదేశం మీద అనేక విధాలుగా సుంకాల పేరుతో పన్నులు పెంచుతున్న కనీసం నోరు మెదపకుండా ఉన్నాడన్నారు. రష్యా నుండి చమురు కొనుగోలు చేయకూడదని ఆంక్షలు విధిస్తున్న మోడీ ప్రభుత్వం ఎలాంటి ఖండన ఇవ్వకపోవడం విడ్డూరమని అన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరిగింది, ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే విధానాలను తీసుకొచ్చి వ్యవసాయ కూలీల పొట్టగొట్టాలని మోడీ ప్రభుత్వం చూస్తుందని దీనికి తోడుగా గ్రామాలలో 125 రోజులు పని కల్పిస్తున్నామని తప్పుడు ప్రచారాలు చేసుకుంటుందన్నారు.
రానున్న కాలంలో ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే ప్రయత్నం బీజేపీ చేస్తుందని, అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చి పేదవాడికి విద్యుత్ భారాన్ని మరింత పెంచే విధంగా మోడీ ప్రభుత్వ విధానం ఉందన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఇవ్వని రాయితీలు పెట్టుబడుదారులకు కాంట్రాక్టర్లకు ఇస్తున్నాడని వారు అన్నారు. గతంలో నల్ల చట్టాలను తీసుకురావడం రైతుల పోరాటంతో రైతాంగానికి మద్దతు ధరను ఇస్తామని చెప్పి నూతనంగా విత్తన చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడని, దీని ద్వారా వ్యవసాయ రంగం దివాళ తీసే అవకాశాలు ఉన్నాయన్నారు. కార్మికుల పొట్టకొట్టే లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మిక వర్గంపై మరింత పని ఒత్తిడిని పెంచాలని బీజేపీ చూస్తుందని వారన్నారు.
బీహార్ రాష్ట్రంలో ఓట్ల తొలగింపు చేసి అధికారంలోకి రావడం జరిగిందని, ఇదే పనిని ఇతర రాష్ట్రాలలో చేయాలనే ప్రయత్నం బీజేపీ చేస్తుందని అన్నారు. సిబిఐ, ఈడిని తన గుప్పెట్లో ఉంచుకొని రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తప్పుడు ఆర్థిక విధానాలు అనుసరిస్తూ మతోన్మాదాన్ని పెంచడం లాంటి పనులు బీజేపీ చేస్తుందన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో కుల దురహంకారానికి బలైపోయిన రెండు నెలల పసికందు కుటుంబానికి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం చేయలేదని, దోషులను శిక్షించలేదని వారు గుర్తు చేశారు.
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా తొలగించిన ఇండ్లను వెంటనే నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే పత్తి కొనుగోలు చివరి దశ చేరుకున్న సీసీఐ కేంద్రాల్లో దళారుల వ్యాపారాలు అధికమయ్యాయి తప్ప, రైతులకు జరిగిన లాభం ఏమీ లేదని అన్నారు. కపాస్ యాప్ తీసుకువచ్చిన రైతులకు జరిగిన మేలు ఏమీ లేదని వారు అన్నారు.
అదేవిధంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో యాదాద్రి భువనగిరి జిల్లాకు నిధులు కేటాయింపు విషయంలో అన్యాయం చేసిందని అన్నారు. ప్రస్తుతం ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్లో జిల్లా అభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జెల్లెల పెంటయ్య బూరుగు కృష్ణారెడ్డి గుంటోజు శ్రీనివాసాచారి జిల్లా కమిటి సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, సిర్పంగి స్వామి, దయ్యాల నరసింహ, మాయ కృష్ణ, బొల్లు యాదగిరి, మద్దెల రాజయ్య, ఎండి పాష, బొడ్డుపల్లి వెంకటేష్ ,గుండు వెంకటనర్సు, గంగదేవి సైదులు, మద్దేపూరం రాజు ,బోలగాని జయరాములు, ఎంఎ ఇక్బాల్, గడ్డం వెంకటేష్ రాగిరు కిష్టయ్య, బల్గూరి అంజయ్య, గోశిక కరుణాకర్, నాయకులు పల్లెర్ల అంజయ్య, ధూపటి వెంకటేష్, ర్యాఖల శ్రీశైలం, పోతరాజు జహంగీర్, లావుడియా రాజు, ఈర్లపల్లి ముత్యాలు, వడ్డేబోయిన వెంకటేష్ పాల్గొన్నారు.



