శాస్త్రీయ విద్యా విధానం కోసం కృషి చేయాలి
డాక్టర్ మువ్వా రామారావు
జన విజ్ఞాన వేదిక జాతీయ కన్వీనర్
నవతెలంగాణ – భువనగిరి
దశాబ్ద కాలంగా ఏది శాస్త్రీయమో, ఏది మూఢ నమ్మకమో తెలియక ప్రజలు అయోమయంలో పడుతున్నారని, పాలకులు అశాస్త్రీయ భావజాలాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని జన విజ్ఞాన వేదిక జాతీయ కన్వీనర్ డాక్టర్ మువ్వా రామారావు అన్నారు. శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం( రామన్ ఎఫెక్ట్) సందర్భంగా భువనగిరి పట్టణంలోని నవ భారత్ డిగ్రీ కళాశాలలో జరిగిన సైన్స్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ హేతుబద్ధ, తార్కిక విద్యా విధానంతోనే విద్యార్థుల్లో శాస్త్రీయ భావజాలం పెరుగుతుందన్నారు.
భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 51 ఏ హెచ్ తో పాటు 15 ఏ కూడా శాస్త్రీయ, మానవీయ దృక్పథాన్ని పెంపొందిస్తాయని ఆయన అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే కేవలం సైన్స్ పాఠాలు బోధించడమే కాకుండా ప్రయోగాలు చేయించడానికి ఉపాధ్యాయులు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దేశంలో కరువు, నీటి సమస్య, నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం లాంటి విషయాలను అర్థం చేసుకోవడం, వాటి పరిష్కారాలు కనుగొనడం కేవలం శాస్త్రీయ దృక్పథం ద్వారా నే సాధ్యమౌతుందని అన్నారు. భారత స్వాతంత్ర్యం అనంతరం మన మొట్టమొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ అమలు చేసిన, హేతుబద్ధ శాస్త్రీయ ఆలోచనలు భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
జవహర్ లాల్ నేహ్ర కాలంలో ప్రారంభించిన ఐఐటీ, ఏఐఐఎంఎస్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం అందించే సంస్థలు, నాగార్జున సాగర్ లాంటి నీటి పారుదల ప్రాజెక్టుల ఆలోచనలు ఇప్పటివరకు ఏ ప్రధాన మంత్రి కూడా ఆలోచించలేదని ఆయన అన్నారు. నవ భారత్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చిక్కా ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన మానవ హక్కుల కోసం ఒక వైపు ప్రయత్నం చేస్తూనే మరోవైపు మన బాధ్యతలను విస్మరించరాదని ఆయన అన్నారు. ఈ సమావేశంలో భారత రాజ్యాంగ పీఠిక పీఠిక ను విద్యార్థులతో కలిసి అతిథులు చదివారు.
కొండల్ రెడ్డి చేసిన మేజిక్ లు, సుదర్శన్ పాడిన పాటలు విద్యార్థులను అలరించాయి. ఈ సమావేశంలో జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు కందుకూరి సుదర్శన్, జె. కొండల్ రెడ్డి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్టా భాస్కర్ రెడ్డి, జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్, జిల్లా ఎస్సీ ,ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బర్రె సుదర్శన్, సీనియర్ జర్నలిస్టు మెరుగు చెన్నయ్య, నవ భారత్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఫూల్ చంద్, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.



