• సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్
నవతెలంగాణ -పెద్దవంగర
సైన్స్ అభివృద్ధి ద్వారానే మానవ జీవితం ముందుకు సాగుతుందని సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్, మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీవీ రామన్ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలు, ప్రయోగాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ మాట్లాడుతూ శాస్త్రీయ ఆలోచనా విధానం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని అన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పై ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని వ్యాఖ్యానించారు. విద్యార్థుల్లో పరిశోధనాత్మక దృక్పథం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సదయ్య, తఖీ పాషా, ముఖేష్, శ్రీధర్, గౌరీ శంకర్, రమేష్, కరుణాకర్, సత్యం, సారయ్య, కరుణ, హైమ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



