టైమ్ ప్లానింగ్ విషయంలో మీరు బాధ్యతగా మెలగాలి. అలా మెలగాలంటే ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. అంటే మీలో బలహీనతలు, బలాలు అన్నమాట. అలా తెలుసుకున్న తరువాత బలహీనతలను అధిగమించడానికి కొంత టైమ్ మేనేజ్ చేసుకోవాలి.
ఎంత ప్రయత్నించినా ఒక్కొక్కసారి ఎందుకనో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయలేకపోతున్నామంటూ చాలామంది వ్యధచెందుతూ వుంటారు. ఉదాహరణకు కాలేజీకి వెళ్ళే అమ్మాయినే తీసుకుందాం. కాలేజీ, లైబ్రరీ, సినిమా, డ్రామా, క్లబ్, స్నేహితుల్ని కలవడం, ఇంటికి సరైన సమయానికి చేరుకోవడం ఇవన్నీ ఒకరోజులో చేయాల్సిన పనుల జాబితా. ఇలా అన్ని పనుల్ని ఒకే రోజు పూర్తి చేయాలనుకోవడం వల్ల చివరకు ఏ పనీ పూర్తి కాని గందరగోళ స్థితి ఏర్పడుతుంది. ఇక రాత్రి అయ్యేసరికి, ఈరోజు ఏదీ సవ్యంగా చేయలేకపోయామే అన్న అసంతప్తి మిగిలిపోతుంది. కాలేజీలకు పోయే పిల్లల విషయంలోనే కాదు, ప్రతిరోజూ ఎవరి వ్యాపార వ్యవహారాల్లో వాళ్ళు హడావిడిగా పరిగెత్తుకుపోయే వారికి, చివరకు ఇంట్లోనే వుండి వంటా వార్పూ తెముల్చుకునే మహిళలకు కూడా ఇది వర్తిస్తుంది. దీన్ని అధిగమించాలంటే… ఏం లేదు.. కాస్తంత ప్లానింగ్ వుండాలి! అనుకున్న మేరకు సమర్థవంతంగా పని (లేదా పనులను) పూర్తి చేయగలిగామన్న ఆత్మసంతప్తి ఏర్పడాలి. అప్పుడే.. మానసిక ఒత్తిడి కూడా బాగా తగ్గుతుంది. చేతిలో వున్న పరిమితమైన కాలాన్ని, ఒకేసారి అన్ని పనులకు ఎలా సర్దాలో అర్ధంకాక తికమక పడకుండా వుండాలంటే… కొన్ని రూల్సు పాటించాలి!.
ప్రైమ్ టైమ్ అంటే…?
పవర్ సప్లై వున్నంత వరకూ లేదా నిరాటంకంగా సరఫరా అయ్యేంత వరకు ఒక యంత్రం ఒకేలా పనిచేస్తూనే వుంటుంది. స్విచ్ వేసిన మొదట్లో బాగా పని చేసి, ఒక అరగంట పోయాక, ”కాస్త టీ తాగి వస్తాను గురూ!” అని పర్మిషన్ అడగదు. తిరిగి మీరు స్విచ్ ఆఫ్ చేసేంత వరకూ ఒకే వేగంతో, ఒకే సమర్థతతో పనిచేస్తుంది. మరి మనం యంత్రాల్లా వుండలేం కదా!… పవర్ సప్లై మనకు నిరంతరం ఆటంకం లేకుండా వస్తున్నప్పటికీ, అడపాదడపా, ‘రిలీఫ్’ లేకపోతే మనం తట్టుకోలేం. నాన్ స్టాప్‌గా పనిచేసే యంత్రం అయినా, ఏ నట్టో, బోల్టో లూజు అయ్యిందనుకోండి… కాస్త మొండికేస్తుంది. మనకు అట్లా ఏ బోల్టూ లూజు కాకపోయినా… తరచూ రిలాక్స్ కావడం తప్పనిసరి, అయితే ఒకసారి రిలాక్స్ కావడానికి… మళ్ళీ మరో దఫా రిలాక్స్ కావడానికి తపించే మధ్య కాలంలో మనం అత్యంత సమర్థవంతంగా పనిచేస్తాం. అలా పనిచేసే సమయాన్నే ప్రైమ్ టైమ్ అంటారు. కాగా ఈ ‘ప్రైమ్ టైమ్’ ఒకొక్కరిలో ఒక్కోలా వుంటుంది. అట్లాగే ఏ వ్యక్తికయినా సరే, ఒక్కోసారి ఒక్కోలా వుంటుంది. అది వాళ్ళ వాళ్ళ జీవన శైలిని బట్టి, క్రమశిక్షణాయుతమైన అలవాట్లను బట్టి వుంటుంది. మొత్తం మీద ప్రైమ్ టైమ్‌లో మనిషి అత్యంత ప్రతిభావంతంగా పని చేయగలడని, పలు పరిశోధనల్లో నిర్ధారణ అయ్యింది.
దీనిని ఎలా కనుక్కోవాలి?
సాధారణంగా ఈ పనిని ఎవరికి వారే ఇండివిడ్యువల్‌గా చేసుకోవల్సిందే! ఎందుకంటే, ఒక వ్యక్తి ప్రతిభావంతంగా పనిచేసే సమయమేదో ఆ వ్యక్తి కన్న ఎక్కువగా ఎవరికీ తెలియదు. ఇందుకు తేలికయిన చిట్కా ఏమిటంటే, మీరు పూర్తిచేసిన పనులను గుర్తుకు తెచ్చుకోండి. మీకు సంతప్తికరంగా పూర్తయ్యిందన్పించిన ఒక పనిని మీరు ఆరోజు ఏయే సమయాల్లో చేశారో ఐడెంటిఫై చేయండి. మీ విషయంలో మీరు సమర్థవంతంగా పని చేసే ప్రైంటైమ్ అదే అన్నమాట! శాస్త్రజ్ఞులు చెప్పేదేమిటంటే, సహజంగా మన మెదడుకు గల అన్ని రకాల పనితనపు సామర్ధ్యాలు ఒకేసారి సవ్యంగా పనిచేయగలిగే సమయమే ప్రైం టైమ్ అవుతుంది. ఉదాహరణకు కాలేజీ విద్యార్థినే తీసుకున్నారనుకోండి. పరీక్షలకు ప్రిపేర్ కావడానికి రివిజన్ చేయాలి! అందుకు ఉదయం పూట ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే, ఆ సమయంలో మైండ్ ఫ్రెష్‌గా వుంటుంది. కాబట్టి చదివింది ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది.
ప్రైమ్ టైమ్‌లో రకాలు :
ఇందులో ముఖ్యంగా రెండే రెండు రకాలు వున్నాయి. ‘ఇండివిడ్యువల్’ ప్రైమ్ టైమ్, ‘కండిషన్డ్’ ప్రైమ్ టైమ్ అని. ఇండివిడ్యువల్ అంటే పూర్తిగా వ్యక్తి గతం. ఎవరికి వారికి వేరువేరుగా వుండేది. ఇది వాళ్ళు చేసే పనులను బట్టి కూడా ఆధారపడి వుంటుంది. ఉదాహరణకు నేను క్లయింట్‌తో క్లినిక్‌లో వ్యవహరించేటపుడు నాకది ప్రైమ్ టైం. రచనలు చేయడానికి సాధారణంగా, ఉదయం 5 గంటల నుండి ఆరుగంటల దాకా నాకు ప్రైమ్. ఇక రెండోది కండిషన్డ్ ప్రైమ్ టైమ్. అంటే నిర్దేశిత ప్రైమ్ టైమ్ అని అర్థం. ఆఫీసుల్లో పనిగంటలు ఉదయం 9 గంటల నుండి ప్రారంభమౌతాయి. 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ 2 గంటలనుండి 5 గంటల వరకు ఉద్యోగాలకు ప్రైమ్ టైమ్‌గా నిర్ధారించబడింది. ఆ సమయంలో ఇండివిడ్యువల్‌గా వాళ్ళకు మూడ్ లేకపోయినా, పని చేయాల్సిందే. ప్రభుత్వోదోగులు చీటికీ మాటికీ టీ, కాఫీలకు చెక్కేయడానికి, ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు ఇంజక్షన్లు ఇవ్వడంలో పొరబాట్లు చేయడానికి ఇట్లాంటి కండిషన్డ్ ప్రైమ్ టైమింగ్సే కారణం. అయితే తెలివిగా ప్లాన్ చేసుకుని, మనం స్వయంగా మన టైమింగ్స్‌ని, కండిషన లైజ్ చేసుకోగలిగితే, క్రమంగా అదే అలవాటుగా మారి, కొన్నాళ్ళకు మీరు కొత్తగా పెట్టుకున్న టైమింగ్సే ప్రైమ్ టైమింగ్స్ అయిపోతాయి. అందుకు ప్రధానంగా మీరు 3 సూత్రాలను పాటించాలి.
పనిని విభజించుకోవడం:
మీరు పూర్తి చేయాల్సిన పనిని అనువైన భాగాలుగా విభజింపచేసుకోవాలి. అందులో ఒక్కొక్క భాగాన్ని పూర్తి చేసుకోవటానికి కొంత కాల వ్యవధిని నిర్దేశించుకోవాలి. ఆ నిర్దేశిత కాలాన్ని, క్రమశిక్షణాయుతంగా ప్రతిరోజూ పాటించాలి. ఆ సమయంలో మీ ప్రైమ్ టైమ్ అంత వీలైనది కాకపోయినా, క్రమంగా అంతకన్నా ఎక్కువ ఫలితాలనే పొందగల్గుతారు. డిసిప్లిన్ వల్ల వచ్చే ప్రయోజనం అట్లాంటిది.
ప్రయారిటీలు నిర్ధారించుకోవాలి :
మీరు చేయవల్సిన పనులను ముందుగా ఒక లిస్టుగా రాసుకోవాలి. వాటిల్లో దీర్ఘకాలిక, స్వల్పకాలిక పనులను వర్గీకరించాలి. మళ్ళా వాటిల్లో ఏవి ముందు చేయాల్సినవో, ఏవి తరువాత చేయాల్సినవో తెలుసుకోవాలి. ఈ ప్రాధాన్యతలను బట్టి, ఆ రోజు చేయాల్సిన పనులను ముందు పెట్టుకోవాలి!
ఇక మూడవది కలసి పని చేయడం:
మీ పనులు పూర్తి కావటానికి ఇతరుల సహకారం లభించాలంటే సమష్టిగా పనిచేసే అలవాటును పెంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి, శ్రమ వుండవు. క్లాస్ మేట్స్ సోదరులు, సహోద్యోగులతో కలసి పనిచేయడం, అలవర్చుకోవాలి.
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్



