వసంత పురంలో రంగా, రాము ప్రాణ స్నేహితులు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. అదేమిటో కాని ఇద్దరికీ తల్లితండ్రులు లేరు. నివాసం కూడ లేదు. ఇద్దరూ కూలికి వెళ్ళి, దేవాలయం అరుగుపై విశ్రమించే వారు అదే వారి నివాసమైంది. ”ఎవరికి ఏ కష్టం లేకుండా చూడు స్వామి. ఈ ఊరు చల్లగా ఉండాలి ”అని దండం పెట్టుకుని పడుకునే వారు.ఇక రెండు రోజులలో ఊర్లో జాతర జరగబోతుంది. ఎక్కడెక్కడ నుంచో భారీగా జనాలు వస్తారు. వాళ్ళందరిని కంట్రోల్ చేయాలి. అందరికీ అన్ని వసతులు కల్పించాలి అనుకున్నారు. ఆ ఊరి సర్పంచ్ కూడ అదే మాట వీళ్లకు చెప్పాడు.”సరే దొర ”అన్నారిద్దరూ.
సర్పంచ్ చెబితే సరుకులు తేవడానికి పట్నం వెళ్లారు ఇద్దరూ. వెళుతు ఓ వేప చెట్టు కింద కూర్చున్నారు. రాము ఆ వేప చెట్టును నిశితంగా గమనించాడు. కొమ్మలు బాగా పెరిగాయి. చల్లని నీడ నిస్తోంది. ఏదో ఆలోచించి రంగా చెవిలో చెప్పాడు.”బాగానే ఉంటుంది. కాని జనాలను మోసం చేసినట్లు అవుతుందేమో ”అన్నాడు.
”ఆ డబ్బు మన ఊరికే ఉపయోగిద్దాం ”అన్నాడు రాము. ఆలోచన వచ్చిందే తడవుగా ఓ నల్లటి రాయి తెచ్చి పసుపు, కుంకుమ పట్టించాడు. సమీపంలో ఓ పువ్వు తెచ్చి పెట్టాడు. ప్రక్కనే ఓ హుండీ ఏర్పాటు చేశాడు. ఓ అధ్యాత్మిక వాతావరణం అక్కడ కలుగ జేశాడు. రంగా చూస్తూ ఉన్నాడు ”మనం ఏమి పట్టనట్లుగా ఉందాం. అదిగో దూరాన ఓ ఎడ్ల బండి వస్తోంది. వాళ్ళు దిగి టెంకాయ కొట్టి, ఎంతో కొంత దక్షిణ వేస్తారు చూడు ”అన్నాడు. రాము. ఆ బండి లో వాళ్ళు టెంకాయ కొట్టి ఆ రాయికి మొక్కి, ప్రక్కన హుండీలో కొద్దిగా డబ్బు వేశారు. అలా జన ప్రవాహం మొదలయింది. ఓ టెంకాయల గుట్ట పడింది అక్కడ. హుండీ నిండిపోయింది. చీకటి పడుతుంటే హుండీ డబ్బులు లెక్క పెట్టారు. కేవలం కొన్ని గంటల్లోనే పది వేల చిల్లర రావడం చూసి ఆశ్చర్య పోయారు. వెంటనే పట్నం వెళ్ళి సర్పంచ్ తెమ్మన్నవి తెచ్చి ఇంటిలో ఇచ్చి దేవాలయం లో వచ్చి పడుకున్నారు.”ఆ పదివేలతో ఏం చేద్దాం ”అన్నాడు రాము. ”జాతరకు రోడ్డు వేద్దాం. జాతరకు వచ్చే వారికి ఉపయోగం గా ఉంటుంది ”అన్నాడు రంగా. ఎర్ర మట్టితో చక్కటి రోడ్డు వేశారు.” ఇంకా ”అన్నాడు రాము.”నీ మొహం హుండీ అక్కడ పెట్టి రోజు చీకటి వేళకు తెచ్చి లెక్క పెట్టి, ఖర్చు చేద్దాం ”అన్నాడు రాము. ఆరోజే నీళ్ల మోటారు చెడిపోయింది. ఊరి ప్రజలు సర్పంచ్ కు మొర పెడితే రోడ్డు లేదనుకున్నాం రోడ్డు వచ్చింది. అలాగే మోటారు కూడ వస్తుంది. జాతరకు సిద్ధం చేస్తాలే ”అని సమాధానం ఇచ్చాడు. పాపం ఊరి వాళ్ళు బావిలో నీళ్లు తోడుకుని పోయేవాళ్లు.పాపం నీళ్లు తోడుకోలేక ఇబ్బందులు పడ్డారు. రేపు జాతరకు ఎలా అనుకున్నారు. ఈ మాటవిని ఆరోజు హుండీ తెచ్చి లెక్క పెట్టారు. పది వేలకు పైనే ఉంది. వెంటనే పట్నం వెళ్ళి కొత్త మోటారు బిగించారు.
రోడ్డు, నీళ్ల మోటారు రావడం చూసి సర్పంచ్ తో సహా ఊరి వాళ్ళు ఆశ్చర్యం పోయారు.”ఆ రాములోరే మన ఊరిని కాపాడుతున్నారు”అన్నాడు రంగా.”అవును ఇక మంచి నీళ్లకు ఏ కోదువా ఉండదు”అన్నాడు రాము. ఏమో అంత దైవ లీల అనుకున్నాడు సర్పంచ్. అలా జాతర సమయానికి వీధి లైట్స్ ఏర్పాటు చేశారు ఇద్దరు మిత్రులు.”ఇది కొద్ది రోజులు ఎవరికి తెలియ కూడదు. మనమేమి మోసం చేయడం లేదు. వచ్చిన డబ్బుతో ఊరును బాగు చేసుకుంటున్నాం. ఇది ఇలాగే జరగాలి ”అన్నాడు రాము.”మనం మంచే చేస్తున్నాం గా”అన్నాడు రంగా.”రేపు జాతర ముగుస్తుంది. మనం కూడ ఆ హుండీ తీసేద్దాం
మన ఊరికి రోడ్డు, మోటారు పంప్, వీధి లైట్స్ వచ్చాయి. మిగిలిన డబ్బు మన దేవాలయం హుండీలో వేద్దాం ”అన్నాడు రాము. ఆరోజే వేప చెట్టు హుండీ డబ్బులు అన్నీ తెచ్చి రాములోరి దేవాలయం హుండీలో వేశారు. తాము చేసిన పని ఎవరికి చెప్పకుండా రహస్యంగానే ఉంచారు.
కనుమ ఎల్లారెడ్డి, 93915 23027



