నవతెలంగాణ – కాటారం
ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన మాదిగ అమరవీరులకు ఆదివారం కాటారం మండల కేంద్రంలో ఘన నివాళులు అర్పించారు. ఎమ్మార్పీఎస్, కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ కాటారం మండల అధ్యక్షుడు మంథేన చిరంజీవి మాదిగ మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగ ఫలితంగానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన మందకృష్ణ మాదిగ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోయేదని, అమరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు.
ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు వేమునూరి జక్కయ్య మాట్లాడుతూ, ఎస్సీ సామాజిక వర్గ హక్కుల కోసం జరిగిన పోరాటంలో అమరుల త్యాగాలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. వర్గీకరణ ఫలితాలను మాదిగ ఉపకులాలు అనుభవిస్తున్న ఈ సందర్భంలో అమరులను స్మరించుకోవడం తమ బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్కూరి శంకర్, మంథేన సమ్మయ్య, తూకారం కోమురయ్య, దుర్గప్రసాద్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.



