నవతెలంగాణ – ఆలేరు రూరల్
కొలనుపాక గ్రామంలో జరుగుతున్న రేణుకాచార్య జయంతి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం నిర్వహించిన చిత్రపట ఊరేగింపు ధార్మిక సభ, కళ్యాణోత్సవ కార్యక్రమాలు భక్తి వాతావరణంలో అత్యంత వైభవంగా జరిగాయి. రేణుకాచార్య చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించి గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా ఊరేగించారు. ఈ ఊరేగింపులో కర్ణాటకతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో వీరశైవ భక్తులు తరలివచ్చి పాల్గొన్నారు. వివిధ వేషధారణలు ధరించిన భక్తులు ఆధ్యాత్మిక విన్యాసాలు ప్రదర్శిస్తూ ఊరేగింపును మరింత ఆకర్షణీయంగా మార్చారు.
ఊరేగింపు అంతటా “ఓం నమః శివాయ” నినాదాలు మార్మోగాయి. శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు విశేష సంఖ్యలో హాజరై దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తి శ్రద్ధలతో సాగింది. సాయంత్రం రథోత్సవం, లక్షదీపార్చన కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా గ్రామం మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.



