– నాలుగో రోజు కార్యక్రమాల విశేషాలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో అసోసియేట్ డీన్ డా. హేమంత కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం నాలుగో రోజు కార్యక్రమాలు వ్యవసాయ రంగానికి ఉపయోగపడే విధంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా రైతులకు నేలలో తేమ శాతాన్ని కొలిచే విధానాన్ని ప్రదర్శన రూపంలో వివరించారు.తేమ స్థాయిని సరిగ్గా అంచనా వేయడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించవచ్చని, పంటల దిగుబడిని పెంచవచ్చని తెలియజేశారు.అలాగే పంటలలో సరైన నీటిపారుదల విధానాలను వివరిస్తూ,పంట దశను బట్టి నీరు అందించే పద్ధతులను సూచించారు.
అనంతరం విద్యార్థులు గ్రామంలోని సూర్యమండల మోడల్‌ను సందర్శించారు.అందులో కూరగాయలు,దుంపలు మరియు పండ్ల సాగు విధానాలను పరిశీలించారు.రైతులతో ప్రత్యక్షంగా సంభాషిస్తూ తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
తదుపరి పంటల పెంపకంలో ఉపయోగించే పంచగవ్య,ఘన జీవామృతం, ద్రవ జీవామృతం తయారీ విధానాలపై అవగాహన పొందారు.సహజ వ్యవసాయ పద్ధతుల్లో ఇవి పంటల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వివరించారు.పంటలలో క్రిమిసంహారక మందులను పిచికారి చేసే సరైన విధానాన్ని రైతులకు తెలియజేశారు.
అలాగే “వయ్యారి భామ” అనే కలుపు మొక్కను నిర్మూలించే విధానాన్ని ప్రదర్శించి,ఆ మొక్క వలన కలిగే హానికర ప్రభావాలను రైతులకు వివరించారు. అనంతరం పొగాకు రైతులతో కలిసి క్యూరింగ్ విధానం గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డి. స్రవంతి, డాక్టర్ శ్రీజన్, డాక్టర్ ఝాన్సీ రాణి, సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు.


