నవతెలంగాణ – ఆర్మూర్
అమెరికా సామ్రాజ్యవాదం దాని తొత్తు ఇజ్రాయిల్ దేశం ఇరాన్ పై దుర్మార్గపు దాడిని ఖండిస్తూ పట్టణంలోని మామిడిపల్లి భగత్ సింగ్ చౌక్ వద్ద సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి దాసు మాట్లాడుతూ అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్, ప్రపంచ శాంతి అంటూ చిలక పలుకులు పలుకుతూ మరో దిక్కు పశ్చిమ ఆసియా పై తమ దాడులను కొనసాగిస్తున్నాడని, ఇరాన్ దేశంపై నిన్న దుర్మార్గపు దాడి చేయడానికి ఖండిస్తున్నామని దాసు తెలిపారు.
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న దాడిని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఖండించి, ప్రజాస్వామ్య విలువల పట్ల ఉన్న నిబద్ధతను చూపాలని ఆయన కోరారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ప్రపంచ దేశాలపై దాడి చేసే హక్కు ఎవడిచ్చాడు? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికీ అనేక యుద్ధాలుఆపానని తనకు శాంతి దూత బిరుదు ఇవ్వాలని మాట్లాడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేడు చేస్తున్నదేమిటి? అని ప్రపంచ దేశాలు నిలదీయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వెనీజుల అధ్యక్షడిని ఆకారణంగా అమెరికా కిడ్నప్ చేసి,.ఆదేశ ఆయిల్ని తను కంట్రోల్ కి తెచ్చుకున్నారని ఆయన తెలిపారు. అమెరికా సామ్రాజ్యవాద చరిత్ర దుర్మార్గపు, నరహంతక వారసత్వ చరిత్ర అని ఆయన అన్నారు.
అమెరికా దుర్మార్గాలని అర్థం చేసుకోవాలంటే ఒక దళారీ ఒక పశ్చాత్తాపం పుస్తకాన్ని చదివితే అమెరికా సామ్రాజ్యవాద దేశ చరిత్ర స్పష్టంగా అర్థమవుతుందని ఆయన అన్నారు. గతంలో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం ను చంపిందనీ,ఇప్పుడు ఇరాన్ పై పడిందని చమురు ఉత్పత్తుల్ని తన ఆధీనం లోనికి తీసుకోవాలని అమెరికా కుట్ర చేస్తుందని ఆయన అన్నారు. తమ స్వార్థం కోసం, ప్రపంచ దేశాలపై దాడులు కొనసాగిస్తున్న అమెరికా సామ్రాజ్యవాద దేశ ట్రంప్ ప్రపంచ ప్రజల కోపాగ్నికి బలి కాక తప్పదని దాసు హెచ్చరించారు. ఈ దాడుల వల్ల ప్రపంచ ప్రజలు అనేక కష్టానష్టాలను భరించవలసి వస్తుందని ఆయన తెలిపారు. భారతదేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ యుద్దాలవల్ల తీవ్రంగా ప్రాణ నష్టం, ధన నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. ఇది ప్రపంచయుద్ధానికి దారితీస్తోందనీ, మొదటి రెండవ ప్రపంచ యుద్ధాల కంటే తీవ్రంగా ప్రజలు నష్టపోతారని ఆయన తెలిపారు. దేశభక్తితో సామ్రాజ్యవాద వ్యతిరేకతే నిజమైన జాతీయత అని నినదించిన భగత్ సింగ్ అమరత్వస్ఫూర్తితో ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ చేస్తున్న దాడుని తీవ్రంగా ఖండిస్తున్నట్లు దాసు తెలిపారు.
ఈ నిరసన ప్రదర్శనలో న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి సూర్య శివాజీ, ప్రజా సంఘాల నాయకులు బి ప్రిన్స్, ఎస్ వెంకటేష్, భానుచందర్, మగ్గదుం పటేల్, ఇంద్రకరణ్ రెడ్డి, గౌస్ ,వర్ణారెడ్డి, సోయల్, గణేష్, హన్మంత్ రెడ్డి, గోపాల్, కళ్యాణ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



