నవతెలంగాణ – భువనగిరి
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ మూకుమ్మడి దాడి చేసి ఇరాన్ సుప్రీం ఖమేని ని హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకదేశ సార్వమాధికారాన్ని దెబ్బతీసే హక్కు మరే దేశానికి లేదు. ప్రపంచ న్యాయ సూత్రాలను ధిక్కరిస్తూ అమెరికా బరితెగించి వ్యవహారిస్తుందన్నారు. ట్రంప్ పాలనలో యుద్ధన్మాదం తీవ్ర స్థాయికి చేరిందన్నారు. మధ్యప్రాచ్యంలోని చమురు పై ఆదిపత్యం కోసం అన్ని దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో జ్యోక్యం చేసుకోవడం దాడులకు పాల్పడడం అమెరికాకు పరిపాటిగా మారిందన్నారు.
ఈమధ్య వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురో నిర్బంధించడం,గ్రీన్ ల్యాండ్ తమదే నని పట్టుపట్టడం, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఏకపక్షంగా వ్యవహరించడం పాలస్తీనాను ధ్వసం చేయడంలో ఇజ్రాయిల్ కు అండగా నిలవడం,గతంలో హైతి అధ్యక్షుడు జీన్ బట్రాండ్ ను కిడ్నాప్ చేసి పదవి నుంచి తొలగించడం, హేండూరస్ అధ్యక్షుడు జువాన్ ఆర్లాండోను అరెస్ట్ చేసి 45 ఏండ్లు శిక్షించడం, గౌతమాలలో కమ్యూనిజాన్ని వ్యతిరేకించే పేరుతో జాకబ్ ఆర్ బెంజ్ ను తొలగించడం, ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను ఉరి తీయడం, లిబియా అధ్యక్షుడు గడాఫీని హత్య చేయించడం ఇలా అనేక దురాగతాలను ప్రోత్సహించిందన్నారు.
అమెరికా ప్రపంచ ఆధిపత్యం కోసం చేస్తున్న ఈ చర్యలను భారత ప్రభుత్వం ప్రపంచ శాంతికాముకులు అభ్యుదయ వాదులు ఖండించకుంటే వర్ధమాన, పేద దేశాలపై అమెరికా సామ్రాజ్య వాద దాడులు కొనసాగే అవకాశం ఉందన్నారు. నేడు ఇరాన్ రేపు మరికొన్ని దేశాలు బలిగాకముందే ప్రజలంతా అమెరికా ట్రంప్ చర్యలను ఇజ్రాయిల్ దురాగతాలను వ్యతిరేకించాలని సిపిఎం జిల్లా కమిటీ కోరుతుందన్నారు.



