ఎంపికైన లబ్ధిదారులకు పరికరాలు వెంటనే పంపిణి చేయాలి
బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెంచాలి
27 నెలలైన హామీలను అమలు చేయని ప్రభుత్వం
మార్చి 13న హైదరాబాద్‌లో సామూహిక నిరాహార దీక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచాలనీ, ఎంపికైన లబ్ధిదారులకు పరికరాలు వెంటనే పంపిణి చేయాలనీ, బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేస్తూ మార్చి 13న హైదరాబాద్‌లో సామూహిక నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. అడివయ్య తెలిపారు. ఆదివారం హైదరాబాద్ చిక్కడపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వేదిక రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్, ప్రధాన కార్యదర్శి యం.అడివయ్య, కోశాధికారి ఆర్.వెంకటేష్, ఉపాధ్యక్షులు బి.స్వామి, సహాయ కార్యదర్శి జెర్కొని రాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అడివయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 27 నెలలవుతున్నా ఎన్నికల హామీలను అమలు చేయలేదని విమర్శించారు. వికలాంగుల పెన్షన్ రూ.4,016 నుంచి రూ.6 వేలకు పెంచడంతో పాటు చేయూత పెన్షన్స్ రూ.2,016 నుంచి రూ.4 వేలకు పెంచి 2023 డిసెంబర్ నెల నుంచే అమలు చేస్తామని హామీలు ఇచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 అక్టోబర్ నాటికి రాష్ట్రంలో 44,49,767 మందికి పెన్షన్స్ వస్తే 2026 జనవరి నాటికి 42,80,129 మందికి పెన్షన్స్ వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,69,638 మంది పెన్షన్స్ రద్దు చేసిందన్నారు.. పెన్షన్ పెంచకుండా పెన్షన్స్ రద్దు చేసే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది? అని ప్రశ్నించారు.
2023 అక్టోబర్ నాటికి 5,14,422 మందికి పెన్షన్స్ వస్తే 2026 జనవరి నాటికి 4,84,850 మందికి పెన్షన్స్ వస్తున్నవి. 29,572 మంది వికలాంగుల పెన్షన్స్ రద్దు చేశారని తెలిపారు. చేయూత పెన్షన్స్ కోసం ప్రతి నెల రూ.994.50 కోట్లు అవసరమని చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 14,628.91 కోట్లు నిధులు కేటాయించిన ప్రభుత్వం రూ.10,514.32 కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు. కేటాయించిన నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేయడం లేదంటే చేయూత లబ్ధిదారుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థం అవుతుందని విమర్శించారు. 2026-27 బడ్జెట్లో 5 శాతం నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. చేయూత పెన్షన్స్ కోసం 24.85 లక్షల మంది దరఖాస్తు చేసుకుని 26 నెలలుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వం మంజూరు చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఒకవైపు నిధులు లేవంటూనే ముఖ్యమంత్రి గాంధీ కుటుంబానికైతే రూ.1,000 కోట్లు రాష్ట్రం నుంచి ఇస్తామని ఎలా ప్రకటించారని ప్రశ్నించారు. రూ.5 వేల కోట్లతో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రికి చేయూత పెన్షన్స్ పెంచాలనే ఆలోచన ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సహాయ పరికరాల కోసం 15 వేల మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ పరికరాలు మాత్రం పంపిణి చేయడం లేదన్నారు. రూ.50 కోట్లు నిధులు విడుదల చేశామని ప్రచారం చేసుకుంటున్న సర్కార్ పరికరాలు ఎందుకు సరఫరా చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం చెపుతున్న మాటలకు, వాస్తవాలకు పొంతన లేకుండా ఉందని ఎద్దేవా చేశారు. మార్చి 16 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో పెన్షన్స్ పెంపుపై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.



