ఓజోన్ ఆస్పత్రి 13వ వార్షికోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ-నాగోల్
మారుతున్న కాలానుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రాణాలను కాపాడటంలో ముందుండాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. శనివారం రాత్రి నాగోల్‌లోని పీబీఆర్ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన ఓజోన్ ప్రయివేటు ఆస్పత్రి 13వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తోటి మనుషుల ప్రాణాలను కాపాడటంలో వైద్య వృత్తికి మించింది లేదన్నారు. వృత్తి ధర్మాన్ని ముందుంచుకుని రోగాల బారిన పడిన వారు, ప్రమాదాలకు గురైన వారు ఆస్పత్రికి వచ్చినప్పుడు సకాలంలో అత్యుత్తమ వైద్య సేవలు అందించి ప్రాణాపాయం నుంచి రక్షించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని తెలిపారు. గత 13 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో ఓజోన్ ఆస్పత్రి అనేక మందికి మెరుగైన వైద్య సేవలు అందించి ప్రాణాలను కాపాడినట్టు ఆస్పత్రి యాజమాన్యం వివరించగా, మంత్రి యాజమాన్యాన్ని, వైద్యులను, సిబ్బందిని అభినందించారు.
లాభాపేక్షతో కాకుండా పేద, బడుగు, బలహీన వర్గాల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వారికి అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు కూడా వైద్య సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. సినీ నటుడు సుమన్ తల్వార్ మాట్లాడుతూ.. ఒక ప్రాణాన్ని కాపాడగలిగేది వైద్య వృత్తి మాత్రమేనని అన్నారు. అటువంటి మహత్తర వృత్తిని ఎంచుకుని సేవలందిస్తున్న వైద్యులను అభినందించారు. ఆస్పత్రి చైర్మెన్ బీవీ సత్యసాయి ప్రసాద్ మాట్లాడుతూ.. కొత్తపేట నుంచి ఎల్‌బీనగర్ వైపు వెళ్లే విజయవాడ ప్రధాన రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో అత్యవసర వైద్య సేవల అవసరాన్ని గుర్తించి ఈ ప్రాంతంలో ఓజోన్ ఆస్పత్రిని స్థాపించామని తెలిపారు. 13 సంవత్సరాలుగా అత్యాధునిక సదుపాయాలతో అనేక అత్యవసర కేసులను సమర్థంగా నిర్వహిస్తూ ప్రాణాలను కాపాడుతున్నామని వెల్లడించారు.
ముఖ్యంగా అత్యవసర కేసుల్లో ఆర్థిక అంశాలను పక్కనబెట్టి ముందుగా ప్రాణరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని తమ వైద్యులకు సూచిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా వైద్య నైపుణ్యం కనబరిచిన సీనియర్ వైద్యులను మంత్రి పొన్నం ప్రభాకర్, సినీ నటుడు సుమన్ తల్వార్, చైర్మెన్‌బీవీ సత్యసాయి ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ దీప్తిలు శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. వార్షికోత్సవ వేడుకల్లో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బంది, వైద్యులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి మేనేజర్ రవీందర్ రెడ్డి, వైద్యులు, సిబ్బంది, ఆస్పత్రిలో చికిత్స పొందిన పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.



