– నెల్లికుదురు ఎస్సై చిర్రా రమేష్ బాబు
నవతెలంగాణ – నెల్లికుదురు
హోళీ పండుగను ఆనందోత్సాహాలతో పాటు బాధ్యతతో, పరస్పర గౌరవంతో మండల ప్రజలు జరుపుకోవాలని నెల్లికుదురు ఎస్సై చిర్రా రమేష్ బాబు సోమవారం కోరారు. పండుగ వేళ సహజసిద్ధమైన, పర్యావరణ హిత రంగులను మాత్రమే వినియోగించాలని, రసాయనాలతో కూడిన హానికర రంగులను పూర్తిగా నివారించాలని సూచించారు. ఇతరుల అభిమతానికి విరుద్ధంగా బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం వంటి చర్యలు చేయరాదని స్పష్టం చేశారు.
ప్రార్థనా స్థలాలు, ఆసుపత్రులు, ప్రధాన రహదారులు, ప్రజా ప్రదేశాలలో ఎటువంటి అసౌకర్యం కలిగించకూడదని తెలిపారు. హోలీ పండుగ చందా పేరుతో రహదారులపై బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠినచర్యలు తీసుకోబడతాయని తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు
పండుగ రోజు మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచిస్తూ, మండల వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యువత అతివేగంగా వాహనాలు నడపకుండా జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
నీటి ప్రాంతాల వద్ద జాగ్రత్తలు
ఈత రాని వారు చెరువులు, కుంటలు, కాలువల వద్దకు వెళ్లరాదని, తల్లిదండ్రులు చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు . నెల్లికుదురు మండల ప్రజలందరూ శాంతి, సౌహార్ద్ర వాతావరణంలో, పరస్పర గౌరవంతో హోళీ పండుగను సురక్షితంగా జరుపుకొని పోలీసు శాఖకు సహకరించాలని నెల్లికుదురు ఎస్సై చీర రమేష్ బాబు కోరారు.



