– ఉచిత ఆరోగ్య శిబిరం
– మాదకద్రవ్యాల వ్యతిరేక ర్యాలీ
– రైతులకు పత్తి పాలు ప్రదర్శన
నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె. హేమంత కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా ఈరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మొదటగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి సున్నం వేసి పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు.అనంతరం విద్యార్థులు గ్రామస్థులతో కలిసి వ్యక్తిగత పరిశుభ్రత,ఆరోగ్య పరిరక్షణపై అవగాహన చర్చలు నిర్వహించారు.
తరువాత ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఆరోగ్య సమస్యలను గుమ్మడివెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మధులిక చేత పరీక్షలు చేయించుకున్నారు. ఆమె రోగులకు తగిన సలహాలు ఇచ్చి అవసరమైన మందులు అందజేశారు.అలాగే విద్యార్థులు గ్రామస్తులతో ఆరోగ్య సంబంధిత సందేహాలపై చర్చించి స్పష్టతనిచ్చారు. అనంతరం విద్యార్థులు గ్రామంలో మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు.
రైతులకు ఉపయోగకరంగా ఉండే విధంగా పత్తి విత్తనాల నుంచి పాలను తీసే విధానం, దాని లాభాలను ప్రదర్శన ద్వారా వివరించారు. కార్యక్రమం చివర్లో విద్యార్థులు నాటకాలు, నృత్య ప్రదర్శనలు చేసి గ్రామస్తుల మన్ననలు పొందారు. ఈ కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డి. స్రవంతి, డాక్టర్. ఝాన్సీ రాణి, డాక్టర్. శ్రీజన్ లు సమర్థవంతంగా నిర్వహించారు.



