Tuesday, March 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅన్నారం బ్యారేజీ కూల్చివేతకు కుతంత్రాలు?

అన్నారం బ్యారేజీ కూల్చివేతకు కుతంత్రాలు?

- Advertisement -

ఇసుక తవ్వకాలు అతిపెద్ద నేరం
సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలి : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మేడిగడ్డ బ్యారేజీపై కుట్రలు చేసింది చాలదన్నట్టు, అన్నారం బ్యారేజీని కూల్చేందుకు ప్రభుత్వం కుతంత్రాలకు తెరతీసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) విమర్శించారు. నిబంధనలకు పాతరేసి ఏకంగా బ్యారేజీ కిందే భారీ ఎక్సవేటర్లతో ఇసుక తవ్వకాలు జరపడం దుర్మార్గమే కాకుండా అతిపెద్ద నేరమని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్యారేజీ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న నిబంధనలను ఉల్లంఘించిన మాఫియాపై వెంటనే క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏకంగా బ్యారేజీని బలహీనపరిచి బీఆర్‌ఎస్‌పై బురదజల్లే పన్నాగాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్‌ చేస్తున్న అరాచకపర్వాన్ని అన్నదాతలు క్షమించే ప్రసక్తే లేదని తెలిపారు. నిబంధనలను తుంగలో తొక్కి అన్నారం బ్యారేజీ పిల్లర్ల వద్ద ఇసుక తవ్వకాలు చేసి ఆ బ్యారేజీని ప్రభుత్వం ప్రమాదంలోకి నెడుతున్నదని పేర్కొన్నారు. ఇది కచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే కుట్రేనని విమర్శించారు. పట్టపగలే, నిస్సిగ్గుగా అన్నారం బ్యారేజీ నుంచి కాంగ్రెస్‌ నాయకుల మాఫియా ఇసుకను తోడేస్తున్నదని తెలిపారు. రాష్ట్ర వనరులను కాంగ్రెస్‌ ఎలా కొల్లగొడుతున్నదో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. కాళేశ్వరం బ్యారేజీలకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కాంగ్రెస్‌ పార్టీదేనని స్పష్టం చేశారు. అందినకాడికి దోచుకో దొరికినకాడికి అమ్ముకో ఇవే రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రజా పాలన సూత్రాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులను ప్రజలు భరతం పట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -