కాంగ్రెస్‌కు పెంటగాన్ వర్గాలు వెల్లడి
ట్రంప్ నెతన్యాహు చర్యలపై డెమోక్రాట్ల తీవ్ర విమర్శలు
వాషింగ్టన్ : ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాదాన్ని పెంటగాన్ వర్గాలు పరోక్షంగా ధ్రువీకరిస్తున్నాయి. తాజా భీకర యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన ట్రంప్ వాదనలు.. పెంటగాన్ వర్గాలు వెల్లడించిన సమా చారానికి విరుద్ధంగా ఉన్నాయి. ఇరాన్ ముందుగా దాడి చేయబోతుందని ట్రంప్ యుద్ధ చర్యలకు దిగినప్పటికీ.. అందుకు తగిన ఆధారాలు లేవని పెంటగాన్ అధికారులు కాంగ్రెస్ సభ్యులకు రహస్య సమావేశంలో తెలిపినట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించినట్టు ఈ మేరకు రాయిటర్స్ కథనం వెలువర్చింది. దీంతో తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
ట్రంప్ యంత్రాంగం కాంగ్రెస్ (సెనెట్, ప్రతినిధుల సభ)కు 90 నిమిషాలకు పైగా ఇచ్చిన బ్రీఫింగ్లో.. ఇరాన్ అమెరికాపై ముందస్తుగా దాడి చేయబోతుందనే స్పష్టమైన ఇంటెలిజెన్స్ సమాచారం లేదని అంగీకరించిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రజల ముందకు వచ్చినప్పుడు ట్రంప్, ఆయన యంత్రాంగంలోని అధికారులు మాత్రం ఇరాన్ పై దాడులు, యుద్ధాన్ని సమర్థిం చుకునేలా వ్యవహరించారు. ఇరాన్ నుంచి త్వరలోనే దాడి జరగవచ్చని సూచనలు ఉన్నాయని వారు చెప్పారు. అయితే పెంటగాన్ వర్గాల అంతర్గత వివరణతో ఇదంతా ట్రంప్ యుద్ధోన్మాదానికి ప్రత్యక్ష ఉదాహరణ అని పరిశీలకులు చెప్తున్నారు. అమెరికా, ఇజ్రాయిల్‌లు కలిసి దశాబ్దాల తర్వాత ఇరాన్‌పై విస్తృతమైన సైనిక దాడులను ప్రారంభించిన విషయం విదితమే. ఈ దాడుల్లో ఇరాన్లో వెయ్యికి పైగా లక్ష్యాలను టార్గెట్ చేసుకున్నట్టు అమెరికా సైన్యం తెలిపింది.
డెమోక్రాట్ల ఆగ్రహం
ట్రంప్ చర్యల పట్ల అమెరికాలోని ప్రతిపక్ష డెమోక్రాట్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ట్రంప్ చర్యను ‘ఎంపిక చేసిన యుద్ధం’ (వార్ ఆఫ్ చాయిస్)గా విమర్శిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా భయాన్ని పెంచి యుద్ధానికి దిగారని డోనాల్డ్ ట్రంప్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా యూఎస్- ఇజ్రాయిల్ దాడుల్లో ఇప్పటికే ముగ్గురు అమెరికా సైనికులు మరణించగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇరాన్‌పై దాడులకు దిగిన అమెరికా, ఇజ్రాయిల్ దేశాధినేతలు ట్రంప్, నెతన్యాహు తీరు పట్ల సర్వత్రా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇరాన్‌పై దాడులకు మద్దతిస్తూ ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతున్నారని బెంజమిన్ నెతన్యాహు పైనా విమర్శలు ఉన్నాయి. ఈ మేరకు నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
దాడులను సమర్థించని అమెరికన్లు
డోనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాద చర్యల పట్ల అమెరికన్ల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇరాన్‌పై దాడులను కేవలం 27 శాతం మంది అమెరికన్లు మద్దతిచ్చారు. 43 శాతం మంది వ్యతిరేకతను వ్యక్తం చేశారు. 29 శాతం మంది మాత్రం ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. రాయిటర్స్, ఇప్సోస్ పోల్‌లో ఈ విషయం వెల్లడైంది.



