Tuesday, March 3, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఎనుమాముల మార్కెట్‌లో ఆందోళనలు

ఎనుమాముల మార్కెట్‌లో ఆందోళనలు

- Advertisement -

ధరలు తగ్గాయంటూ మిర్చి రైతులు పోలీసుల వేధింపులు ఆపాలని వ్యాపారులు
అధికారుల హామీతో కాంటాలు ప్రారంభం

నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్‌ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మిర్చి రైతులు, వ్యాపారులు వేర్వేరుగా ఆందోళనలు నిర్వహించారు. దీంతో సుమారు మూడు గంటలపాటు కాంటాలు నిలిచిపోయాయి. చివరకు జిల్లా కలెక్టర్‌, మార్కెట్‌ ఉన్నత అధికారుల హామీతో క్రయవిక్రయాలు సజావుగా సాగాయి. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో యూఎస్‌ 341 రకం మిర్చికి ధరలు
తగ్గించారని రైతులు ఆందోళన నిర్వహించారు. రైతులందరూ మార్కెట్‌ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.

ఈ ఏడాది మిర్చి దిగుబడి తగ్గినా ధరలు బాగానే ఉన్నాయని, కానీ మార్కెట్లో వ్యాపారులు కుమ్మక్కై కావాలనే ధరలు తగ్గిస్తున్నారని రైతులు తెలిపారు. యూఎస్‌ 341 రకం ధర రూ.22వేలపైనే పలకగా నేడు వ్యాపారులు జెండా పాట ధర రూ.18వేలుగా నిర్ణయించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ప్రారంభం నుంచీ మిర్చి సీజన్‌లో ఇంత తక్కువ ధర పలకడం ఇదే తొలిసారి అని అన్నారు. మార్కెట్‌ కార్యదర్శి మల్లేశం ఏనుమాముల సీఐ సురేష్‌ రైతుల వద్దకొచ్చి మాట్లాడారు. చివరికి జెండా పాట ధర రూ.21వేలుగా నిర్ణయించడంతో మిర్చి రైతులు ఆందోళన విరమించారు.

వ్యాపారులపై పోలీసుల వేధింపులు
వ్యవసాయ మార్కెట్‌లో పోలీసులు ఇబ్బందులకు గురి చేయడం మానుకోవాలని డిమాండ్‌ చేస్తూ వ్యాపారులు కాంటాలు నిలిపివేసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు బొమ్మినేని రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గిద్దె ముత్తారం గ్రామానికి చెందిన రైతు రాజు నాయక్‌ మూడు బస్తాల మిర్చిని ఏనుమాముల మార్కెట్‌లో అమ్మినట్టు చెప్పారు. అయితే అదే ప్రాంతంలో మిర్చి బస్తాల దొంగతనం జరిగిందని కొంతమంది రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. అయితే, రాజు నాయక్‌ అమ్మిన బస్తాలు దొంగతనం చేసినవని భావించిన పోలీసులు అతనితోపాటు మిర్చిని కొన్న వ్యాపారులను పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించారని అన్నారు.

రైతులు మార్కెట్‌కు అమ్మకానికి తీసుకొచ్చే మిర్చికి మార్కెట్‌ అధికారులు లాట్‌ ఐడి ఇస్తారని, దాని ఆధారంగానే వ్యాపారులు క్రయవిక్రయాలు జరుపుతారని తెలిపారు. పోలీసులు వ్యాపారులను దొంగల్లా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్‌కు వచ్చే మిర్చి ఎలాంటిదో చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. అనంతరం వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ సత్య శారద, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయితో రవీందర్‌ రెడ్డి మాట్లాడారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని, సంబంధిత పోలీస్‌ అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌, మార్కెట్‌ ఉన్నత అధికారులు హామీ ఇవ్వడంతో వ్యాపారులు ఆందోళన విరమించి కాంటాలు నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -