విద్వేష రాజకీయాలు, కార్పొరేట్లు, సామ్రాజ్యవాదుల ప్రయోజనాలే ముఖ్యం
అమెరికా ట్రేడ్ డీల్‌తో భారత్‌లో వ్యవసాయ సంక్షోభం
ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తున్న ఈసీ
మతం, కులం ఆధారంగా పెరుగుతున్న దాడులు
ఉపాధి హామీ చట్టం స్వరూపాన్ని దెబ్బతీసిన కేంద్రం
24న ఢిల్లీలో భారీ ప్రజా ప్రదర్శన
కేరళ అభివృద్ధిపై తెలంగాణ సీఎం వాస్తవాలు తెలుసుకోవాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర విస్తృత సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్ అరుణ్‌కుమార్
ఆరు గ్యారంటీలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి : రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అమెరికా ఫస్ట్ అని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నట్టుగా ఇండియా ఫస్ట్ అని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు చెప్పడం లేదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్ అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడానికి మోడీ సాగిల పడుతున్నారని విమర్శించారు. ట్రంప్, మోడీ, నెతన్యాహు ముగ్గురిలోనూ సైద్ధాంతిక సారూప్యత ఉందన్నారు. ఆ ముగ్గురికీ ముస్లింలపై నరనరాన ద్వేషముందని చెప్పారు. భారత్‌తోపాటు ఇజ్రాయిల్ లోనూ మతం ఆధారంగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. అమెరికాలో ట్రంప్ జాత్యాహంకారాన్ని పెంచుతున్నారని అన్నారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర విస్తృత సమావేశాన్ని సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు.
ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు టి జ్యోతి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ మోడీ ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లి ఆ దేశ అధ్యక్షుడు నెతన్యాహు మంచి పనులు చేస్తున్నారంటూ ప్రశంసించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇరాన్ ఇస్లాం మత నాయకుడు ఖమేనీ సహా మరో 40 మంది చనిపోతే స్పందించని మోడీ యూఏఈపై ఇరాన్ దాడి చేస్తే ఖండించారని గుర్తు చేశారు. వెనిజులా అధ్యక్షుడు మదురోను అపహరిస్తే అనేక దేశాలు ఖండించినా మోడీ మాత్రం స్పందించలేదని చెప్పారు. సోషలిస్టు క్యూబాను అమెరికా దిగ్బంధం చేసిందన్నారు. విశ్వగురు అని చెప్తున్న మోడీ గొంతెత్తడం లేదని అన్నారు.
భారత్‌పై టారిఫ్‌లను తగ్గించని అమెరికా
అమెరికాతో భారత ప్రభుత్వం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుందని అరుణ్ కుమార్ చెప్పారు. అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌లను 18 శాతానికి తగ్గించడమే విజయంగా భారత ప్రభుత్వం ప్రకటించిందన్నారు. గతంలో మూడు శాతం టారిఫ్‌లే ఉండేవని గుర్తు చేశారు. భారత్‌లో అమెరికా వస్తువుల దిగమతిపై 30 శాతం టారిఫ్‌లు ఉంటే దాన్ని సున్నా శాతానికి తగ్గించిందని వివరించారు. దీనివల్ల భారత వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పత్తి, సోయాబీన్ దిగుమతి చేసుకుంటే ఆ రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ఇప్పటికే దిగుమతులు పెరగడం, సబ్సిడీలు తగ్గడం, గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల పత్తి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు.
ఉపాధి హామీ చట్టం వచ్చాక ఆత్మహత్యలు తగ్గాయని వివరించారు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ చట్టం స్వరూపాన్ని పూర్తిగా మార్చి వేసిందన్నారు. దీంతో వ్యవసాయ కార్మికులకు ఉపాధి హక్కుగా ఉండబోదని అన్నారు. కేంద్రం నిర్ణయాల వల్ల వ్యవసాయరంగం సంక్షోభంలోకి నెట్టివేసే ప్రమాద ముందని ఆందోళన వ్యక్తం చేశారు. అణుఒప్పందం చట్టంలోనూ కేంద్రం మార్పులు చేసిందన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే అణురియాక్టర్‌ను తయారు చేసే వారిని కాకుండా నిర్వాహకులను శిక్షించాలంటూ నిబంధనలను మార్చిందని చెప్పారు. భోపాల్ దుర్ఘటన జరిగినా యాజమాన్యంపై చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు.
ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ కుట్ర
అసోం సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయని అరుణ్‌కుమార్ అన్నారు. అసోంలో ముస్లిం వ్యతిరేకతను పెంచడం ద్వారా మత వైషమ్యాలను పెంచి గెలిచేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని విమర్శించారు. బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు వచ్చారంటూ ప్రచారం చేస్తున్నదని చెప్పారు. అక్కడి భూములను కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తున్నదని అన్నారు. కార్పొరేట్లు, సామ్రాజ్యవాదుల ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వం పని చేస్తున్నదని విమర్శించారు. మద్యం పాలసీ కేసులో ప్రాథమిక ఆధారాల్లేవంటూ కేజ్రీవాల్‌పై సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని చెప్పారు. కేరళ సీఎం పినరయి విజయన్‌పై కూడా తప్పుడు కేసులను నమోదు చేసిందన్నారు.
బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఈడీ, సీబీఐని ప్రయోగిస్తున్నదని విమర్శించారు. ఈసీకి లేని అధికారాలను తీసేసుకుంటున్నదనీ, సర్‌ను అమలు చేస్తున్నదని చెప్పారు. బీహార్, పశ్చిమబెంగాల్లో లక్షల సంఖ్యలో ఓటర్లను తొలగించారని అన్నారు. ఈసీ పక్షపాతంతో వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తున్నదని చెప్పారు. మతం, కులం ఆధారంగా దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. యూజీసీ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఏబీవీపీ పనిచేస్తే కేంద్రం వెనక్కి తీసుకుందని చెప్పారు. ఐఐటీ, ఐఐఎంలలో దళిత విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనీ, వాటిని నివారించాలని సుఖేదేవ్ థోరట్ సిఫారసులు చేస్తే పట్టించుకోలేదన్నారు.
రోహిత్ వేముల చట్టాన్ని తేలేదనీ, లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోలేదని అన్నారు. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోలేదనీ, ఉపాధి చట్టాన్ని పునరుద్ధరించలేదని చెప్పారు. బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 24న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ ప్రజా ప్రదర్శన ఉంటుందన్నారు. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలతోపాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి ప్రజలను సమీకరిస్తామని చెప్పారు. ఇప్పటికే జన ఆక్రోశ్ పేరుతో జాతాలను నిర్వహిస్తున్నామని వివరించారు. కేరళలో బీజేపీ బలపడాలని ప్రయత్నిస్తున్నదని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కేరళ వెళ్లి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆయన కేరళ అభివృద్ధి గురించి వాస్తవాలను తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు. అక్కడ అత్యంత పేదరికాన్ని నిర్మూలించిందని గుర్తు చేశారు.
హామీల అమలుకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలి : జాన్‌వెస్లీ
ఆరు గ్యారంటీలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం రాష్ట్ర బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను కేటాయించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్, దావోస్ పర్యటనలు చేసినా పెట్టుబడులు రాలేదని అన్నారు. ప్రచారార్భాటం తప్ప ఏమీ లేదన్నారు. పార్టీ ఫిరాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం నాటకం ఆడుతున్నదని చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన దస్త్రాలుండొద్దనే కుట్రతోనే ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబడిందన్న ఆరోపణలు వస్తున్నాయని అన్నారు.
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో పదేండ్ల నుంచి నివాసముంటున్న ఇండ్లను నేలమట్టం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. విలువైన భూముల్లో పేదలుండొద్దంటూ మంత్రులు మాట్లాడ్డం విడ్డూరంగా ఉందన్నారు. అక్కడ పెద్దఎత్తున ఆందోళన జరుగుతున్నదనీ, పేదల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. గాంధీ విగ్రహం నిర్మాణానికి రూ.ఐదు వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని అన్నారు. మూసీ నది ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూల్చాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటన బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ గెలిచిందని చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. సమస్యలపై వామపక్షాలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి నాగయ్య, జూలకంటి రంగారెడ్డి, చుక్క రాములు, పాలడుగు భాస్కర్, టి సాగర్, మల్లు లక్ష్మి, పి ప్రభాకర్, బండారు రవికుమార్, నున్నా నాగేశ్వరరావు, ఎండీ జహంగీర్ పాల్గొన్నారు.



