భద్రత, సాధికారతకు సమగ్ర కార్యాచరణ : మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మరిన్ని సంక్షేమ పథకాల వరాలు అందించనున్నట్టు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రి మహిళల భద్రత, సంక్షేమం, సాధికారత కోసం అవలంబించాల్సిన నూతన విధానాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థలు, హాస్టళ్లు, కార్యాలయాలు, రాత్రి వేళల ప్రయాణాలు, డిజిటల్ వేదికలు, అసంఘటిత రంగం వంటి విభిన్న రంగాల్లో ఉన్న వ్యవస్థాపరమైన లోపాలను అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా భద్రతను కేవలం చట్టపరమైన అంశంగా కాకుండా మౌలిక వసతులు, సాంకేతికత, అవగాహన, పర్యవేక్షణ, బాధ్యతాయుత పరిపాలనల సమన్వయంతో చూడాలని సూచించారు. మహిళల రక్షణ కోసం విద్యాసంస్థలు, కార్పొరేట్ సంస్థల్లో, కంపెనీల్లో అంతర్గత ఫిర్యాదుల తప్పనిసరి ఆడిట్ వ్యవస్థను అమలు చేయాలని ఆదేశించారు. రాత్రి 8 గంటల తర్వాత మహిళా ఉద్యోగులకు జీపీఎస్ అనుసంధానిత సురక్షిత రవాణా విధానం ఉండాలని సూచించారు.
అసంఘటిత రంగ మహిళల కోసం ప్రత్యేక నమోదు, గుర్తింపు కార్డు, ఫిర్యాదు వ్యవస్థ ఏర్పాటు చేయాలనీ, ప్రజా రవాణాలో సీసీటీవీ పర్యవేక్షణను బలోపేతం చేసి పీక్ అవర్స్‌లో భద్రతా ఆడిట్లు నిర్వహించాలని మంత్రి కోరారు. సైబర్ మార్ఫింగ్, స్టాకింగ్, బ్లాక్‌మెయిల్ వంటి నేరాలపై వేగంగా స్పందించడంతో పాటు బాధితులకు కౌన్సెలింగ్ కల్పించాలన్నారు. వద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగ మహిళల రక్షణకు ప్రత్యేక విధానాలు రూపొందించాలని ఆదేశించారు. గృహ హింస కారణంగా ఒంటరిగా మిగిలిన మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో రుణాలు అందించి స్వయం ఉపాధి అవ కాశాలు కల్పించాలన్నారు. ఆశ్రయ గృహాలు, హాస్టళ్ల భద్రతపై డిజిటల్ పర్యవేక్షణ ప్రోటో కాల్ అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. మహిళల భద్రతకు సంబం ధించి హోం, మహిళా శిశు సంక్షేమ, విద్య, కార్మిక, రవాణా, మున్సిపల్ పరిపాలన, ఐటి, ఆరోగ్య శాఖల సమన్వయంతో రాష్ట్ర స్థాయి మహిళా భద్రత కన్వర్జెన్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి సూచించారు.
మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులందరికీ సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్స్ సిద్దం చేయాలనీ, ప్రయివేటు రంగంలో పని చేస్తున్న మహిళలకు మెటర్నిటీ బెనిఫిట్స్ చట్టపరమైన రక్షణతో అందేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. లైంగిక వేధింపుల కేసుల పురోగతిపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రతి గ్రామంలో మహిళా సంఘాల కోసం ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మించాలనీ, వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లలో చేరిక ప్రక్రియను ప్రభుత్వ యాప్ ద్వారా పారదర్శకంగా నిర్వహించాలని ఆమె తెలిపారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు మహిళా సాధికారతకు అవసరమైన పలు కీలక పథకాలను రూపొందించి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదంతో త్వరలో ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. ఈ సమవేశంలో మహిళలకు వచ్చే ఆర్దిక సంవత్సరంలో ఇవ్వాల్సిన ఇందిరమ్మ మహిళా శక్తి చీరల డిజైన్లను మంత్రి సీతక్క, సెర్ప్ సీఈఓ దివ్యా దేవ రాజన్ పరిశీలించారు. డిజైన్లలో చేయాల్సిన మార్పులను సూచించారు. కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను వచ్చే ఆర్దిక సంవత్సరంలో కూడా పంపిణి చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు.
మహిళలకు మరిన్ని సంక్షేమ వరాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



