Tuesday, March 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండెయిరీ లాభాల కోసం ఎన్‌డీడీబీతో ఒప్పందం

డెయిరీ లాభాల కోసం ఎన్‌డీడీబీతో ఒప్పందం

- Advertisement -

– మదర్‌ డెయిరీ చైర్మెన్‌ గుడిపాటి మధుసూదన్‌ రెడ్డి
నవతెలంగాణ-హయత్‌నగర్‌

నార్ముల్‌ మదర్‌ డెయిరీ లాభాల కోసమే నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఎన్‌డీడీబీ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు డెయిరీ చైర్మెన్‌ గుడిపాటి మధుసూదన్‌ రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌ హయత్‌నగర్‌లోని మదర్‌ డెయిరీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పది సంవత్సరాలుగా సంస్థ లాభాల నుంచి పూర్తిగా నష్టాల్లోకి వెళ్లిందని, ప్రస్తుతం సంస్థ పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిందని అన్నారు. నిబంధనల కారణంగా ప్రభుత్వం నుంచి ప్రత్యక్ష సహాయం అందించలేమని ముఖ్యమంత్రి పేర్కొన్నారని తెలిపారు. తప్పని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి, మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంతో ఎన్‌డీడీబీతో సుమారు 15 ఏండ్లపాటు అమల్లో ఉండే అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నామని వివరించారు. ఎన్‌డీడీబీ సహకారంతో నష్టాల్లో ఉన్న నార్ముల్‌ మదర్‌ డెయిరీకి త్వరలోనే పూర్వ వైభవం తీసుకొస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. నార్ముల్‌ ప్రతినిధి సామ మహిపాల్‌రెడ్డితో కూడిన బృందంతో కలిసి రెండ్రోజుల కిందట ఎన్‌డీడీబీ చైర్మెన్‌ మీనేష్‌, ఎండీఐఎల్‌ ప్రతినిధులతో చర్చించినట్టు తెలిపారు. ఈ క్రమంలో సంస్థ ఆర్థిక సమస్యలు, పాల ఉత్పత్తి-విక్రయాలు, రైతులకు చెల్లించాల్సిన బిల్లులు, ఉద్యోగుల సమస్యలపై మంత్రితో కూడిన బృందం ఎన్‌డీడీబీ చైర్మెన్‌కు నివేదించిందన్నారు. దీనిపై స్పందించిన ఎన్‌డీడీబీ చైర్మెన్‌ రైతుల పాల బిల్లుల కోసం తక్షణ సహాయంగా రూ.10 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. పాలకవర్గం ద్వారా పాల సేకరణ కొనసాగిస్తూ, విక్రయాలను ఎన్‌డీడీబీ పర్యవేక్షిస్తుందని తెలిపారు. అధికారుల బృందాన్ని పంపించి అన్ని సమస్యలనూ సమగ్రంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. రైతులు అపోహలు పెట్టుకోవద్దని, త్వరలోనే సమస్యలు పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాలకవర్గ సభ్యులు జయశ్రీ, ఉప్పల్‌ వెంకట్‌ రెడ్డి, జలంధర్‌ రెడ్డి, అలివేలు రంగారెడ్డి, పుప్పాల నర్సింహులు, కస్తూరి పాండు, సందిల భాస్కర్‌ గౌడ్‌, ఎండీ కాటిపల్లి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -