ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడు మృతి
నవతెలంగాణ – ఆర్మూర్
హోలీ పండగ రోజున మంగళవారం పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది . పట్టణంలోని గోల్ బంగ్లా కు చెందిన బోడగ హర్షత్ (15) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. తన స్నేహితులతో కలిసి హోలీ ఆడుకున్న తర్వాత గుండ్ల చెరువు వద్ద ఉన్న ట్యాంక్ బండ్లు చూడడానికి వెళ్ళినాడు. ఈ క్రమంలో కాలుజారి చెరువులో పడిపోయాడు.
ఇతనికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. అదేవిధంగా పట్టణంలోని సమీప ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. కాగా హర్షద్ మృతితో పట్టణంలోని గోల్ బంగ్లా ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పండగ పూట వారి కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.



