Wednesday, March 4, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమక్క రైతు బిక్కమొఖం

మక్క రైతు బిక్కమొఖం

- Advertisement -

ఈ ఏడాది పెరిగిన దిగుబడులు.. ధర విషయంలో రైతుల ఆందోళన
అమెరికా దెబ్బకు తగ్గుతున్న మొక్కజొన్న ధరలు
బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం క్వింటా రూ.1900 లోపే..

నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మొక్కజొన్న ధరలు మార్కెట్‌లో పతనమవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటి నుంచి మార్చి ఆరంభంలో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికాలోని చికాగో బోర్డ్‌ ఆఫ్‌ ట్రేడ్‌ (సీబీవోటీ)లో మొక్కజొన్న ధరలు తగ్గుముఖం పట్టాయి. దీని ప్రభావం భారతీయ మార్కెట్లపైనా పడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు క్వింటా మొక్కజొన్నలను రూ.1,900కు మించి కొనటం లేదు. రానున్న రోజుల్లోనూ ఇదే ధర కొనసాగితే రైతులు తీవ్రంగా నష్టపోతారు. మరో 15 రోజుల్లో మొక్కజొన్నలు మరింతగా మార్కెట్‌కు వస్తాయి. కానీ ఇప్పటివరకూ మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది మొక్కజొన్న ధరలు కనీస మద్దతు ధర కంటే అధికంగా ఉండటంతో మార్క్‌ ఫెడ్‌ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు.

ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా లేని దృష్ట్యా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈసారి మక్కలకు క్వింటాకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) రూ.2,400 ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా ప్రయివేట్‌ వ్యాపారులు మద్దతు ధరకు మక్కలను కొనటం లేదు. అనేక ప్రాంతాల్లో మార్కెట్‌ ధరలు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే తక్కువగా నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో క్వింటా ధర రూ.1,950 వద్ద కొనసాగుతోంది. కొన్ని మార్కెట్లలో క్వింటాకు రూ. 1,900 నుంచి రూ. 2,000 మధ్య ధరలు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తేనే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.

గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం
గత వానాకాలంలో అధిక వర్షాలతో పత్తి, వరి, పెసర, మినుము, మిరప సాగుచేసిన రైతులకు సరైన దిగుబడులు రాలేదు. పలువురు రైతులు అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. వాటి నుంచి బయటపడేందుకు యాసంగిలో మక్కల సాగుకు పూనుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 1.60 లక్షలు, భద్రాద్రి జిల్లాలో 60 వేల ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట పండిస్తున్నారు. 10 జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. ఖమ్మం తర్వాతి స్థానంలో నాగర్‌ కర్నూల్‌ (1.10 లక్షల ఎకరాలు), మహబూబాబాద్‌ (1.02 లక్షలు), నిర్మల్‌ (99 వేలు), వరంగల్‌ (96 వేలు)తో పాటు కొత్తగూడెం, గద్వాల, జగిత్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌ వంటి పది జిల్లాల్లో 27వేల ఎకరాల నుంచి 70వేల ఎకరాల వరకు సాగైంది. మిగతా జిల్లాల్లో కూడా వేల ఎకరాల్లోనే మొక్కజొన్న సాగు చేసిన నేపథ్యంలో ఈసారి విస్తీర్ణం 10.60 లక్షల ఎకరాల మార్కును దాటింది.

మక్కల గిట్టుబాటుపై ఆందోళన ఉంది : లక్ష్మి, ముత్యాల గూడెం, కూసుమంచి
ఈసారి మిరప బాగా లేకపోవడంతో మొక్కజొన్న వేసినం. ఇంకో పది రోజుల్లో పంట చేతికి వస్తుంది. కానీ ఎవరిని అడిగినా రేటు తగ్గుతుంది అంటున్నారు. రూ. 2000కు పైగా రేటు ఉంటేనే ఎంతో కొంత మిగులుతుంది. పోయినేడు మిరపకాయలకు రేటు లేక నష్టపోయినం. మక్కల గిట్టుబాటు అయితయో లేదోనని భయంగా ఉంది.

మార్గదర్శకాలు రాలేదు : సునీత, మార్క్‌ ఫెడ్‌ ఖమ్మం జిల్లా మేనేజర్‌
మొక్కజొన్న పంట చేతికొచ్చే సమయం సమీపిస్తోంది. ఇంకో 15 రోజుల్లో కొనుగోళ్లు ఊపందుకుంటాయి. కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఇప్పటివరకు మాకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదు. నియమ నిబంధనలు వచ్చాక జిల్లా స్థాయి పర్చేజింగ్‌ కమిటీ సమావేశంలో వాటి గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

గతేడాది మద్దతు ధరకు మించి..
2023-24లో ఖమ్మం జిల్లాలో 33, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11 కొనుగోలు కేంద్రాలను మార్క్‌ఫెడ్‌ ఏర్పాటు చేసింది. వీటి ద్వారా చాలామంది రైతులకు మేలు జరిగింది. గతేడాది ప్రభుత్వం కనీస మద్దతు ధర క్వింటాకు రూ. 2,240 ప్రకటించింది. అయితే వ్యాపారులు పోటీపడి మద్దతు ధరకు మించి కొనుగోలు చేశారు. రైతులు కూడా బహిరంగ మార్కెట్లో విక్రయించారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం రాలేదు. ఈ సంవత్సరం ఇప్పటివరకు పరిస్థితిని చూస్తే మొక్కజొన్న రైతులు క్వింటా రూ.500కు పైగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇదే తీరు ఉంటే అత్యధిక అన్నదాతలకు ఇక్కట్లు తప్పవు.

ఇట్లయితే ఖర్చులు కూడా రావు..
ఇదే పరిస్థితి ఉంటే కనీసం ఖర్చులు కూడా రావని రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట దిగుబడులను విక్రయించాలంటే రైతులు మార్కెట్‌కు, కొనుగోలు కేంద్రాలకు తరలించాల్సి ఉంటుందని, అయితే ప్రస్తుతం ఉన్న ధరకు రవాణా ఖర్చులు కూడా చేతికి వచ్చే పరిస్థితులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

భారీగా పెరిగిన పెట్టుబడులు
మక్క సాగు పెట్టుబడులు కూడా భారీగా పెరిగాయి. 50 కిలోల ఎరువుల బస్తా ధర రూ.1,500-2,000 పలుకుతోంది. వివిధ ప్రయివేట్‌ విత్తన కంపెనీలు కిలో మొక్కజొన్న విత్తనాలను రూ.600 చొప్పున రైతులకు విక్రయించాయి. అంటే నాలుగు కిలోల ప్యాకెట్‌ను రూ.2,400కు అమ్మాయి. కానీ అదే రైతు పండించిన మొక్కజొన్నలను మాత్రం వ్యాపారులు కిలో రూ.19కే కొంటున్నారు. రైతులు తమ పరిస్థితి ఏమిటని? ఆవేదన చెందుతున్నారు. ఈనెల నుంచి పంట చేతికి వస్తుంది కాబట్టి గిట్టుబాటు ధర లభించేలా చూడాలని కోరుతున్నారు. సరిపడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -