– 136 మంది డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు
నవతెలంగాణ – కామారెడ్డి
రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న “Arrive Alive – క్షేమంగా తిరిగి రండి” కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డీజీపీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమం కామారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా ఎస్పీ యం. రమేష్ చంద్ర అతిథిగా హాజరై కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా 136 మంది డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించగా, అందులో సుమారు 20 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు.
అవసరమైన వారికి డోనర్ల సహకారంతో చికిత్సలు పోలీస్ శాఖ తరఫునే చేయించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎవరినీ వదిలిపెట్టవని, ఒక కుటుంబ యజమాని ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి కోలుకోలేని నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. గత ఏడాది నుంచి రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి నెల చివరి వారంలో “Arrive Alive” కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని చెప్పారు.
డ్రైవర్ల కంటి చూపు సమస్యల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశముందని గుర్తించి ఈ నెల ప్రత్యేకంగా కంటి పరీక్షలపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. వయస్సు పెరిగే కొద్దీ చూపు మందగించడం సహజమని, డ్రైవర్లు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జిల్లాలో రోడ్డు ప్రమాద మరణాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని ఎస్పీ తెలిపారు. ఫిబ్రవరి 2024 లో 22 మరణాలు నమోదు కాగా, ఫిబ్రవరి 2025లో 14, ఫిబ్రవరి 2026లో 12 మరణాలు మాత్రమే నమోదయ్యాయని వెల్లడించారు.
“ఒక్క ప్రాణం కాపాడినా ఒక కుటుంబంలో వెలుగు నింపినట్లే” అని ఆయన పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ రూట్ డ్రైవింగ్, హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ ధరించకపోవడం, అతివేగం వంటి తప్పులు చేయవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవరచుకుని అప్రమత్తంగా వాహనం నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, పట్టణ ఎస్హెచ్ఓ నరహరి, ట్రాఫిక్ ఎస్ఐ మహేష్, దేవునిపల్లి ఎస్ఐ రంజిత్ తదితరులు డ్రైవర్లు పాల్గొన్నారు.



