నవతెలంగాణ – కాటారం
రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, డ్రైవర్లలో భద్రతపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా Telangana Police ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ARRIVE ALIVE – Road Safety Campaign” కార్యక్రమంలో భాగంగా కాటారం లో ఐ చెకప్ శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరాన్ని కాటారం డీఎస్పీ ఏ. సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో నిర్వహించగా, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. డ్రైవింగ్ సమయంలో స్పష్టమైన చూపు ఎంతో ముఖ్యమని, కంటి సమస్యలు ముందుగానే గుర్తిస్తే ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 150 మంది ఆటో డ్రైవర్లు మరియు లారీ డ్రైవర్లు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి వైద్యుల సూచనలు ఇవ్వడంతో పాటు తగిన చికిత్స పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ కాటారం ఈ. నాగార్జున రావు, ఎస్సై కాటారం ఏ. శ్రీనివాస్ తదితరులు పాల్గొని డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలను వివరించారు. ఈ విధమైన శిబిరాలు తరచూ నిర్వహించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.



