– పరాకాష్టకు చేరిన ‘పాడి’ – సీపీ వివాదం..
– పరువు నష్టం దావాకు సిద్ధమవుతున్న గౌస్ ఆలం
– న్యాయనిపుణులతో చర్చిస్తున్న ఐపీఎస్ సంఘం బాధ్యులు
– కుటుంబ సభ్యులను వివాదంలోకి లాగడంపై పోలీసు బాస్ ఆగ్రహం
– రాజకీయ విమర్శలా? వ్యక్తిగత కక్షా?
– ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యే ‘వీడియో’ అస్త్రాలు
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. కానీ, అవి ఒక అధికారి వ్యక్తిగత జీవితాన్ని, వారి కుటుంబ సభ్యులను తాకినప్పుడు అది వివాదాంశమవుతుంది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, పోలీస్ కమిషనర్ (సీపీ) గౌస్ ఆలం మధ్య జరుగుతున్న పరిణామాలు సరిగ్గా ఇదే పరిస్థితిని తలపిస్తున్నాయి. గతంలోనే ఒకసారి సీపీపై అనుచిత వ్యాఖ్యలు చేసి, క్షమాపణలు చెప్పి వెనక్కి తగ్గిన ఎమ్మెల్యే.. ఇప్పుడు మళ్లీ అదే సీపీని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ, పోలీసు వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఆధారాలు ఉన్నాయి.. 15 రోజుల్లో బయట పెడతానని ఎమ్మెల్యే సవాల్ విసురుతుంటే.. మరోవైపు సీపీ గౌస్ ఆలం న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు.
వివాదానికి ఆజ్యం పోసిన ‘హైదరాబాద్ ప్రెస్‌మీట్’
ఇటీవల హైదరాబాద్‌లో మీడియా వేదికగా ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేసిన ఆరోపణలు కరీంనగర్ పోలీసు యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఒక ప్రముఖ షాపింగ్ మాల్ నుంచి ఎన్వోసీ కోసం రూ. 25 లక్షలు వసూలు చేశారని, ఇందులో ఏసీపీ విజయ్ కుమార్, సీఐ సజన్‌రెడ్డి పాత్ర ఉందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇక్కడి నుంచి సీపీ వ్యక్తిగత విషయాలపైనా వ్యాఖ్యలు చేశారు. సీపీ గౌస్ ఆలం తన భార్య కోసం ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను పంపుతున్నారని, తండ్రి, అన్న కోసం పోలీస్ వాహనాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. సీపీ ఇంట్లో ఏకంగా 20 మంది కానిస్టేబుళ్లు పని చేస్తున్నారని, దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు.
తిప్పికొట్టిన పోలీస్ యంత్రాంగం..
ఎమ్మెల్యే ఆరోపణలపై పోలీసు వర్గాల నుంచి తీవ్ర ప్రతిఘటన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సీపీ భార్య విషయంలో ఎమ్మెల్యేకు తప్పుడు సమాచారం అందిందని వారు వాదిస్తున్నారు. సీపీ సతీమణి చేసేది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం కాదని, ఆమె ఆస్పత్రి మేనేజ్‌మెంట్ కోర్సులో భాగంగా ఇంటర్న్‌షిప్ చేస్తున్నారని, దీనికి పోలీసు రక్షణతో సంబంధం లేదని స్పష్టం చేశారు. షాపింగ్ మాల్ మేనేజింగ్ పార్ట్‌నర్ శ్రీధర్‌రెడ్డి సైతం స్పందిస్తూ.. ఆ ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని, తామెవరికీ లంచం ఇవ్వలేదని తేల్చి చెప్పారు. గౌస్ ఆలం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంట్లో ఉండే సిబ్బందిని నలుగురికి తగ్గించారని, 20 మంది అనే మాట వాస్తవ దూరం అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
తెరవెనుక ‘సస్పెండ్’ అయిన ఎస్‌ఐ హస్తం?
ఈ మొత్తం వ్యవహారంలో ఒక ఆసక్తికరమైన కోణం వినిపిస్తోంది. ఇసుక ట్రాక్టర్ల నుంచి వసూళ్ల వ్యవహారంలో ఇటీవల సీపీ చేత సస్పెండ్ అయిన ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) ఎమ్మెల్యేకు ఈ సమాచారాన్ని అందిస్తున్నట్టు పోలీసు శాఖ అనుమానిస్తోంది. సదరు ఎస్‌ఐ తన సస్పెన్షన్ పగతో సీపీ కుటుంబ సభ్యుల కదలికలపై నిఘా పెట్టి, తప్పుడు లేదా వక్రీకరించిన సమాచారాన్ని ఎమ్మెల్యేకు చేరవేసి ఉండొచ్చనే చర్చ సాగుతోంది.
15 రోజుల గడువు.. ఏం జరగబోతోంది?
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తాను చెప్పిన ‘వీడియో’ ఆధారాలను 15 రోజుల్లో బయటపెడతానని సవాల్ విసిరారు. ఒకవేళ ఆయన వద్ద బలమైన ఆధారాలు లేకపోతే, ఈసారి ఆయన ఎదుర్కోబోయే న్యాయపరమైన చిక్కులు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధికి, శాంతిభద్రతల రక్షకుడికి మధ్య జరుగుతున్న ఈ పోరు కరీంనగర్ రాజకీయాల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
న్యాయ పోరాటానికి సీపీ సిద్ధం!
సాధారణంగా ఇలాంటి విమర్శలను లైట్ తీసుకునే పోలీసు అధికారులు, ఈసారి మాత్రం తగ్గకూడదని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. తన వ్యక్తిగత ప్రతిష్టకు, కుటుంబ గౌరవానికి భంగం కలిగించినందుకుగాను ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై సీపీ గౌస్ ఆలం పరువు నష్టం దావా వేసేందుకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎమ్మెల్యే తీరుపై ఐపీఎస్ అధికారుల సంఘం కూడా తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే ఒకసారి క్షమాపణ చెప్పి మళ్లీ అదే బాటలో పయనించడంపై వారు చట్టపరమైన చర్యలకు మొగ్గు చూపుతున్నారు. సమ్మక్క జాతర నాటి ఘటనలతోపాటు తాజా వ్యాఖ్యలపై లీగల్ ఒపీనియన్ తీసుకుని మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.



