Thursday, March 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా రక్త చరిత్ర

అమెరికా రక్త చరిత్ర

- Advertisement -

ఆయిల్‌ నిక్షేపాల కోసమే యూఎస్‌ అధ్యక్షుల బరితెగింపు
2001 నుంచి పలు దేశాలపై దాడులు
9/11 తర్వాత ‘వార్‌ ఆఫ్‌ టెర్రర్‌’ పేరుతో యూఎస్‌ సైనిక చర్యలు షురూ
మూడు పూర్తిస్థాయి యుద్ధాలు.. పది దేశాలపై బాంబు దాడులు
లక్షల సంఖ్యలో మృతులు.. ట్రిలియన్‌ డాలర్ల వ్యయం

వాషింగ్టన్‌ : అమెరికా తప్పితే మరొక దేశం ఆర్థికంగా, అభివృద్ధి పరంగా, అణుశక్తిలో ముందుండకూడదని పలు సందర్భాల్లో ఆ దేశ అధ్యక్షుల చర్యలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకోసం సైనిక చర్యలకు దిగడం, యుద్ధాలు జరపడం, బాంబుల వర్షం కురిపించడం ఆ దేశానికి సర్వ సాధారణమైపోయింది. ఇక 2001లో అమెరికాలో 9/11 దాడుల తర్వాత పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ‘వార్‌ ఆఫ్‌ టెర్రర్‌’ పేరిట అమెరికా తన సైనిక చర్యలను ప్రారంభించింది. అప్పటి నుంచి అమెరికా మూడు పూర్తిస్థాయి యుద్ధాలు చేసింది. డ్రోన్‌ దాడులు, వైమానిక దాడులు, ఆక్రమణలు వంటి చర్యలతో కనీసం పది దేశాలపై బాంబుదాడులు జరిపింది. 2001లో అప్పటి బుష్‌ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వరకు.. అమెరికా యుద్ధోన్మాదానికి లక్షలాది మంది అమాయక ప్రజలు, ఆయా దేశాల నాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధాలతో మానవ, ఆర్థిక వ్యయం విపరీతంగా పెరిగింది.

ఆఫ్ఘనిస్తాన్‌ యుద్ధం (2001-2021)
9/11 దాడుల తర్వాత మొదటి, అత్యంత ప్రత్యక్ష ప్రతిస్పందనగా ఆఫ్ఘనిస్తాన్‌ను టార్గెట్‌గా చేసుకున్నది. అక్కడ అల్‌ఖైదాను నిర్మూలించడం, తాలి బాన్లను అధికారం నుంచి తొలగించడం పేరుతో దారుణాలకు తెగబడింది. 2001, అక్టోబర్‌ 7న యూఎస్‌.. ఆపరేషన్‌ ఎండ్యూరింగ్‌ను ప్రారం భించింది. కొన్ని వారాల్లోనే తాలి బాన్‌ పాలనను తొలగిం చింది. అయితే, సాయుధ ప్రతి ఘటన గ్రూపులు అమెరికా, సంకీర్ణ దళాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ ప్రతిఘటనను కొనసా గించాయి. ఈ యుద్ధం యూ ఎస్‌ చరిత్రలో 20 ఏండ్లుగా ఒక సుదీర్ఘ సంఘర్షణగా మారింది. అమెరికాలో నలుగురు అధ్యక్షులు మారేంత వరకు కొనసాగింది. చివరకు 2021లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో తిరిగి నియంత్రణను సాధించిన విషయం విదితమే.

ఇరాక్‌ వార్‌ (2003-2011)
2003, మార్చి 20న బుష్‌.. రెండో యుద్ధాన్ని ప్రారంభించారు. అది ఈ సారి ఇరాక్‌ పైన. కారణం.. ఆ దేశ అధ్యక్షుడు సద్ధాం హుస్సేన్‌ వద్ద సామూహిక విధ్వంసక ఆయుధాలు ఉన్నాయని ఆరోపిస్తూ దాడులకు తెగబడ్డారు. అయితే ఆ వాదన తప్పని నిరూపితం కూడా అయింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సద్ధాం హుస్సేన్‌తో పాటు పలువురు అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చివరకు 2008లో బుష్‌ యూఎస్‌ యుద్ధ దళాలను ఉపసంహరించుకోవడానికి అంగీకరించారు. ఈ ప్రక్రియ 2011లో అప్పటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హయాంలో పూర్తయింది.

తగ్గిపోతున్న అమెరికా మిస్సైళ్ల నిల్వలు
ఇరాన్‌తో మరో 10రోజులు యుద్ధం కొనసాగితే ఇబ్బందులే? : పెంటగాన్‌ నివేదిక
ఇరాన్‌తో సైనిక ఘర్షణ వేళ అమెరికా రక్షణ శాఖ అధికార వర్గాలు కీలక హెచ్చరిక చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇరాన్‌పై దాడులు మరో 10 రోజులకుపైగా కొనసాగితే అమెరికా మిస్సైళ్ల నిల్వలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని పెంటగాన్‌ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారంటూ అంతర్జాతీయ మీడియా రాసుకొచ్చింది. ఇప్పుడు ఈ కథనం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికా ఇప్పటికే టోమాహాక్‌ ల్యాండ్‌ ఎటాక్‌ మిస్సైళ్లు, గగనతల రక్షణ వ్యవస్థల్లో వినియోగించే ఎస్‌ఎం-3 ఇంటర్‌సెప్టర్ల కొరతను ఎదుర్కొంటోందని ఆ అధికారి చెప్పారని కథనంలో సదరు మీడియా పేర్కొంది.

అమెరికా క్షిపణి నిల్వలపై పెంటగాన్‌ నివేదిక
రాబోయే 24 గంటల్లో ఇరాన్‌పై దాడులకు అమెరికా పెద్ద సంఖ్యలో మిస్సైళ్లు, ఇంటర్‌సెప్టర్లను వినియోగించే అవకాశం ఉందని ఆ పెంటగాన్‌ అధికారి తెలిపారు. దీంతో అమెరికా సైన్యం వద్దనున్న ఆయుధ నిల్వలు ఒక్కసారిగా తగ్గిపోతాయన్నారు. మరో నాలుగైదు వారాల పాటు ఈ యుద్ధం కొనసాగొచ్చనే సంకేతాలు ఇచ్చేలా ఇటీవలే అమెరికా ప్రెసిడెంట్‌ డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా పెంటగాన్‌ అధికార వర్గాల నుంచి ఆయుధాల కొరతతో ముడిపడిన వార్త బయటకి రావడం గమనార్హం.

శ్వేతసౌధంలో రేపు సరఫరాదారులతో ట్రంప్‌ భేటీ
ఆయుధ ఉత్పత్తిని వేగవంతం చేయాలని భావిస్తున్న దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ శుక్రవారం ముఖ్యమైన రక్షణ కాంట్రాక్టర్లతో శ్వేతసౌధంలో సమావేశం కాబోతున్నారు. లాక్‌హీడ్‌ మార్టిన్‌, రేథియాన్‌ పేరెంట్‌ వంటి ప్రముఖ కంపెనీలు, ఆయుధ సరఫరాదారులు ఈ భేటీకి హాజరవుతారని ఈ ప్రణాళికతో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులు రాయిటర్స్‌ వార్తాసంస్థకు తెలియజేశారు. చర్చలు అధికారికంగా కాకుండా ప్రయివేటుగా జరుగుతున్నందున పేర్లు వెల్లడించడానికి వారు నిరాకరించారు.

ఇరాన్‌ ఆపరేషన్‌ ఎక్కువగా ఆయుధాలపైనే ఆధారపడి ఉన్నందున వాటి నిల్వలను అత్యవసరంగా పెంచుకోవాలని ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తోంది. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి, గాజాలో ఇజ్రాయిల్‌ సైనిక చర్యల నేపథ్యంలో అమెరికా అనేక బిలియన్‌ డాలర్ల విలువ కలిగిన ఆయుధాలను నిల్వ చేసుకుంది. అయితే ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయిల్‌ కంటే అమెరికాయే పెద్ద ఎత్తున క్షిపణులను ప్రయోగిస్తోంది.

ఇరాన్‌ దాడిలో ఆరుగురు అమెరికా సైనికుల మృతి
కువైట్‌లోని షుయిబా ఓడరేవులో ఉన్న అమెరికా కమాండ్‌ కేంద్రంపై ఆదివారం ఇరాన్‌ జరిపిన దాడిలో ఆరుగురు సైనికులు చనిపోయారు. మృతుల వివరాలను అమెరికా సైన్యం అధికారికంగా ప్రకటించింది. ఇరాన్‌ ప్రయోగించిన ‘మానవ రహిత వైమానిక వ్యవస్థ’ గగనతల రక్షణలను తప్పించుకొని కమాండ్‌ కేంద్రంపై దాడి చేసిందని చెప్పింది. ‘శక్తివంతమైన ఆయుధం’ కమాండ్‌ కేంద్రాన్ని తాకిందని అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేథ్‌ తెలిపారు. ఆ దేశంలో 13,000 మందికి పైగా అమెరికా సైనికులు మకాం వేశారు.

2001 తర్వాత అమెరికా దాడులు తీవ్రం
2001, సెప్టెంబర్‌ 11 దాడుల తర్వాత అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్‌ డబ్ల్యూ బుష్‌.. ‘వార్‌ ఆన్‌ టెర్రర్‌’ను ప్రారంభించారు. ఈ సైనిక చర్య యూఎస్‌ విదేశాంగ విధానాన్ని మార్చింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై యుద్ధాలు, దురాక్రమణలు, దాడులకు దారి తీసింది. బ్రౌన్‌ యూనివర్సిటీకి చెందిన వాట్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ అండ్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ విశ్లేషణ ప్రకారం.. 2001 నుంచి యూఎస్‌ నేతృత్వంలో జరిగిన దాడుల్లో ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌, ఇరాక్‌, సిరియా, యెమెన్‌, ఇతర ఘర్షణాత్మక ప్రాంతాల్లో ప్రత్యక్షంగా దాదాపు 9.40 లక్షల మంది ప్రజలు చనిపోయారు. ఇక దాడులు, యుద్ధానంతర పరిస్థితుల కారణంగా తిండి దొరకక, ఆరోగ్యం క్షీణించి చనిపోయిన వారిని కూడా కలిపి లెక్కిస్తే ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

యుద్ధాల విలువ 8 ట్రిలియన్‌ డాలర్లు
2001 నుంచి రెండు దశాబ్దాలకు పైగా జరిగిన ఈ యుద్ధాలు, దాడులకు యూఎస్‌ 5.8 ట్రిలియన్‌ డాలర్లను ఖర్చు చేసినట్టు అంచనా. ఇక రాబోయే 30 ఏండ్లలో మాజీ సైనికుల సంరక్షణ కోసం అమెరికా కనీసం మరో 2.2 ట్రిలియన్‌ డాలర్లు కేటాయించాల్సి ఉంటుందని అంచనా. దీంతో 2001 నుంచి యూఎస్‌ యుద్ధాల విలువ 8 ట్రిలియన్‌ డాలర్లుగా చెప్పొచ్చు.

ఇరాక్‌.. సిరియా
2014 నుంచి ఇస్లామిక్‌ స్టేట్‌ ఐఎస్‌ఐఎల్‌ను ఓడించాలనే లక్ష్యంతో అమెరికా.. సిరియా యుద్ధంలో జోక్యం చేసుకుంది. సిరియాలో నిరంతర వైమానిక దాడులు జరిపింది. అదే సమయంలో స్థానిక భాగస్వామ్య దళాలకు కూడా మద్దతిచ్చింది. ఇక ఇరాక్‌లో.. అమెరికా సైన్యం.. ఐఎస్‌ఐఎల్‌ మిగిలిన గ్రూపులపై పోరాటం పేరుతో దాడులు జరుపుతోంది. 2020లో ట్రంప్‌ ఆదేశాలతో ఇరాన్‌ జనరల్‌ సొలేమానిని డ్రోన్‌ దాడిలో చంపేసింది. ఇలాగే వెనిజులా, క్యూబా, నైజీరియాలపై అమెరికా దాడులకు తెగబడింది.

పాక్‌, సోమాలియా, యెమెన్‌లపై డ్రోన్‌ వార్స్‌
ఇక యుద్ధాలు ప్రకటించనప్పటికీ.. పలు దేశాలపై వైమానిక దాడులకు దిగింది. 2000 ఏడాదిలో అమెరికా గూఢచార సంస్థ సెంల్ర్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ(సీఐఏ).. ఆఫ్ఘన్‌ సరిహద్దు గుండా పాక్‌ ట్రైబల్‌ ఏరియాల్లో డ్రోన్‌ దాడులు చేసింది. అల్‌ఖైదా, తాలిబన్‌ ముఖ్య నేతలే టార్గెట్‌గా చెప్పుకుంటూ వీటిని జరిపింది. ఒబామా పాక్‌లో డ్రోన్‌ దాడులను క్రమ క్రమంగా విస్తరించారు. ఇక సోమాలియాలో అనుమానిత అల్‌ఖైదా అనుబంధ సంస్థలపై అమెరికా వైమానిక దాడులను నిర్వహించింది. అల్‌ఖైదా నేతలే లక్ష్యమంటూ యెమెన్‌లోనూ యూఎస్‌ దళాలు క్షిపణి, డ్రోన్‌ దాడులకు దిగాయి.

లిబియాపై…
2011లో లిబియా నాయకుడు ముయమ్మర్‌ గాడ్డాఫీకి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు సమయంలో అమెరికా నాటో నేతృత్వంలోని జోక్యంలో చేరింది. నో-ఫ్లై జోన్‌ను అమలు చేయడానికి అమెరికన్‌ దళాలు వైమానిక, క్షిపణి దాడులను ప్రారంభించాయి. అనంతరం గడ్డాఫీని పదవీచ్యుతుని చేసి చంపాయి. లిబియా దీర్ఘకాలిక అస్థిరత, వర్గ పోరాటంలోకి దిగాల్సిన పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి.

2.41 లక్షల మంది మృతి
యుద్ధం వల్ల 2.41 లక్షల మంది చనిపోయారని అంచనా. వేలాది మంది యుద్ధం కారణంగా ఆకలితో, వ్యాధులతో, గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల్లో 71,344 మంది పౌరులు. ఇందులో 47వేల మందికి పైగా ఆఫ్ఘన్‌ పౌరులు కాగా 24వేల మందికి పైగా పాకిస్తాన్‌ పౌరులు ఉన్నారు. ఇక 78,314 మంది ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌కు చెందిన సైనిక, పోలీసు సిబ్బంది ఉన్నారు. 136 మంది జర్నలిస్టులు, మీడియా వర్కర్లు ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్ఘనిస్తాన్‌పై యూఎస్‌ యుద్ధం ఖర్చు 2.26 ట్రిలియన్‌ డాలర్లు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -